Articles by "Diet"
Diet లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
ఎక్కువకాలం జీవించాలని కోరుకుంటున్నారా? అయితే తరచుగా చేపలను తిని చూడండి. ఎందుకంటే వీటిల్లోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఆయుష్షు పెరగటానికి దోహదం చేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. రక్తంలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల మోతాదులు తక్కువగా గలవారితో పోలిస్తే అధికంగా ఉన్నవారు రెండేళ్లకు పైగా ఎక్కువగా జీవిస్తున్నట్టు చేస్తున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. అలాగని చేపనూనె మాత్రలు వేసుకుంటే సరిపోతుందిలే అని అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఆహారం ద్వారా లభించ ఒమేగా-3 కొవ్వులతోనే ఈ ప్రయోజనం కనబడుతోందని హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు చెందిన డాక్టర్‌ దారియష్‌ మొజఫరేయన్‌ చెబుతున్నారు. 
రక్తంలోని ఒమేగా-3 స్థాయులకూ మరణం ముప్పు.. ముఖ్యంగా గుండెజబ్బు సంబంధ మరణాల ముప్పు తగ్గటానికీ సంబంధం ఉంటోదంటున్నారు. ఈ కొవ్వులు అధికంగా గలవారిలో ఏ కారణంతోనైనా వచ్చే మరణాల ముప్పు 27% తక్కువగా ఉంటుండగా.. గుండెజబ్బు సంబంధ మరణాల ముప్పు 35% తక్కువగా ఉంటోందని తేలింది. చేపల్లో గుండెకు మేలు చేసే ప్రోటీన్‌, కొవ్వు ఆమ్లాలు దండిగా ఉంటాయి. చేపలు అధికంగా గల ఆహారం తీసుకుంటే గుండెజబ్బు మూలంగా వచ్చే మరణం ముప్పు తక్కువగా ఉంటున్నట్టు గత అధ్యయనాల్లోనూ తేలింది. అయితే ఇతర కారణాలతో వచ్చే మరణాలపై వీటి ప్రభావం గురించి స్పష్టత లేదు. అందుకే మొజఫరేయన్‌ బృందం ఈ దిశగానూ అధ్యయనం చేసింది. వ్యక్తులు చెప్పే అంశాలపై కాకుండా నిజంగా రక్తంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల స్థాయులను లెక్కించి మరీ 16 ఏళ్ల పాటు అధ్యయనం చేసింది. అయితే మరణాల ముప్పు తగ్గటానికీ ఒమేగా-3 కొవ్వులకు నేరుగా సంబంధం ఉంటోందా? లేకపోతే ఇది ఆరోగ్యకర జీవనశైలికిది సూచికా? అన్నది మాత్రం నిర్ధరణ కాలేదు. ఎందుకంటే అధ్యయనంలో పాల్గొన్నవారిలో ఒమేగా కొవ్వులు ఎక్కువగా గలవారు పండ్లు, కూరగాయల వంటివీ బాగానే తీసుకునేవారు. అందువల్ల కేవలం చేపనూనె మాత్రలు తీసుకుంటే సరిపోతుందని భావించటం తప్పని, వాటితో ఇలాంటి ఫలితాలే కనబడతాయని చెప్పలేమని పరిశోధకులు అంటున్నారు. సాధారణంగా 100 గ్రాముల చొప్పున వారానికి రెండుసార్లు చేపలను తినాలన్నది నిపుణుల సూచన.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
నెయ్యి ఎవరికీ మంచిది కాదని భావిస్తూ కొందరు అస్సలు నెయ్యిని పూర్తిగా దూరంగా పెట్టేస్తుంటారు. ఇది సరికాదు. చంటి పిల్లలు, పెరిగే పిల్లలు, రోజంతా కష్టించి బరువు పని చేసేవారు, క్రీడాకారులు.. వీరంతా రోజూ నెయ్యి వంటివి తీసుకోవటం మంచిదే. నెయ్యిలో సహజసిద్ధమైన విటమిన్‌-ఎ ఉంటుంది. ఇది శరీరానికి చాలా మంచిది. పెరిగే పిల్లలకు చాలా మంచి చేస్తుంది. 
కాకపోతే అస్సలు శారీరక శ్రమ లేని కంప్యూటర్‌ ఉద్యోగుల వంటివారు, శారీరక కదలికలు పెద్దగా లేని, మంచం దిగని వృద్ధుల వంటివారు రోజూ నెయ్యి వంటివి తినటం మంచిది కాదు. నెయ్యి అనేది సంతృప్త కొవ్వు కాబట్టి దానివల్ల కొలెస్ట్రాల్‌ పెరిగే అవకాశం ఉంటుంది. మిగతా వంట నూనెలను తగ్గించటమంటే కష్టం గానీ నెయ్యి తగ్గించెయ్యటం, మానెయ్యటం తేలికే. అందుకే ఎదిగే వయసు దాటిపోయిన పెద్దలు దీనికి దూరంగా ఉండొచ్చు.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
గుడ్డులో కొలెస్ట్రాల్‌ ఉంటుంది కాబట్టి దాన్ని తినకూడదని నమ్మేవాళ్లూ చాలామంది ఉన్నారు. కానీ ఇది పూర్తి నిజం కాదు. 
గుడ్డులోని తెల్లసొనలో ఆల్బుమిన్‌, బోలెడన్ని మాంసకృత్తులు ఉంటాయి. దాంట్లో కొలెస్ట్రాలేమీ ఉండదు. పచ్చసొనలోనే కొలెస్ట్రాల్‌ ఉంటుందిగానీ అదొక్కటే కాదు, అందులో విటమిన్‌-ఎ, ఇతర కొవ్వు ఆమ్లాల వంటివెన్నో ఉంటాయి. కాబట్టి అందరికీ గుడ్డు మంచిది. కాకపోతే రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు ఎక్కువగా ఉన్నవాళ్లకు, గుండె జబ్బులు, హైబీపీ వంటివి ఉన్నవారికి ఈ పచ్చసొనతో కొంత ఇబ్బంది ఉండొచ్చు కాబట్టి వాళ్లు పచ్చసొన తీసేసి ఒక్క తెల్లదాన్ని తినొచ్చు. ఏ సమస్యా లేని సాధారణ ఆరోగ్యవంతులు గుడ్డు నిశ్చింతగా తినొచ్చు, రోజుకు ఒకటి తింటే మేలే చేస్తుంది.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
ఆరోగ్యంగా ఉండాలంటే.. కొవ్వు పదార్థాలను తగ్గించుకోవాలని అనుకుంటాం. మరి కొలెస్ట్రాల్‌ సంగతి! అదీ కొవ్వూ.. ఒకటేనా.. రెండూ హాని చేసేవేనా..  మీకూ ఇలాంటి సందేహాలు ఉన్నాయా.. రండి వాటిని నివృత్తి చేసుకుందాం.

సాధారణంగా కొవ్వు పదార్థాలు అనగానే అవి శరీరానికి హానిచేస్తాయనే భ్రమలో ఉంటాం. దాంతో వాటి వినియోగాన్ని తగ్గిస్తాం. లేదంటే పూర్తిగా మానేస్తాం. కానీ శరీరానికి అందే ఇతర పోషకాల్లానే కొవ్వు కూడా మేలుచేసే పదార్థమే. అది మోతాదు మించినప్పుడే సమస్య మొదలవుతుంది. కొలెస్ట్రాల్‌ కూడా అంతే. ఇందులోనూ మేలు, కీడు చేసే రకాలుంటాయి. కొవ్వు వల్ల ఎప్పుడు హాని జరుగుతుందో తెలియాలంటే... అవి ఏయే పదార్థాల నుంచి అందుతాయి.. ఎలా ఉపయోగపడతాయి అన్నది తెలుసుకోవాలి. 

రెండు రకాల్లో.. 

మన శరీరం కొన్నిరకాల కొవ్వుల్ని తయారు చేసుకోలేదు. కాబట్టి ఆహారం నుంచి తీసుకోవాలి. ఇందులో రెండు రకాలుంటాయి. ఒకటి కనిపించేది, మరొకటి కనిపించనిది. కనిపించే కొవ్వు అంటే.. మనం వాడే వేరుసెనగ, రైస్‌బ్రాన్‌, సోయా, సన్‌ఫ్లవర్‌ వంటి రకరకాల వంటనూనెలు. ప్రతి నూనెలో రకరకాల ఫ్యాటీయాసిడ్ల మిశ్రమం ఉంటుంది. ఇదికాక రోజువారీ తీసుకునే ఆహారం నుంచీ మనకు కొద్దో గొప్పో కొవ్వు అందుతుంది. అదే కనిపించనిది. అన్నం, పప్పూ, కూరగాయలూ, పాలూ, గోధుమలూ.. ఇలా వీటన్నింటి నుంచీ రోజుకి ఇరవై గ్రాముల వరకూ కొవ్వు అందుతుంది. ఇక, కొలెస్ట్రాల్‌... జంతు సంబంధిత ఆహార పదార్థాల్లో ఉంటుంది. గుడ్డూ, చికెన్‌, మటన్‌, రొయ్యలూ, కొంత వరకూ పాల నుంచి అందుతుంది. ఇది కూడా శరీరానికి కొంతవరకు అవసరమే. 

ట్రాన్స్‌ఫ్యాట్లతో హాని... 

ఓ పదార్థానికి రంగూ, రుచీ ఇవ్వడంలో, కొద్దిగా తీసుకున్నా పొట్ట నిండినట్లుగా అనిపించడంలో కొవ్వు పాత్ర కీలకం. అయితే ఇందులోనూ రకాలుంటాయి. మొదటిది శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్‌. గడ్డకట్టే స్వభావం ఉన్న రకం ఇది. కొబ్బరినూనె, నెయ్యి, మాంసాహారం, క్రీం, వెన్న, పామాయిల్‌ లాంటి వాటినుంచి అందుతుంది. 
రెండోది, శరీరానికి మేలు అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు. ఇందులో మళ్లీ మోనో అన్‌శాచురేటెడ్‌ (మ్యుఫా), పాలీ అన్‌శాచురేటెడ్‌ (ప్యుఫా) ఉంటాయి. ఆలివ్‌, వేరుసెనగ, రైస్‌బ్రాన్‌ లాంటి నూనెలు 'మ్యుఫా' కిందకొస్తాయి. ఒమెగా త్రీ, సిక్స్‌ ఫ్యాటీ యాసిడ్లు ఉండే సోయా, ఆవ, పొద్దు తిరుగుడు, కుసుమ నూనెలు ప్యుఫా జాబితాలోకి వస్తాయి.  
ఈ నూనెల్లో ఉండే కొవ్వుల్ని శుద్ధి చేసినప్పుడు... నూనెను ఎక్కువగా వేడి చేసినప్పుడూ హానిచేసే ట్రాన్‌ఫ్యాట్లు తయారవుతాయి. కేకులూ, బిస్కెట్లూ, బేకరీ పదార్థాలూ, డాల్డాతో చేసిన రకరకాల స్నాక్స్‌లలో ఈ ట్రాన్స్‌ఫ్యాట్లు అధికంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది.  

అతి అనర్థం అన్నట్లుగా... కొవ్వును మోతాదుకు మించి తీసుకుంటే సమస్యలు తప్పవు. శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి. దాంతో బరువు పెరుగుతాం. అదే ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బుల వంటివి చుట్టుముడతాయి. అధిక కొవ్వు వల్ల పీసీఓడీ (పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌).. థైరాయిడ్‌ సమస్యలూ.. హార్మోన్ల పనితీరులో లోపాలూ.. దాంతో గర్భధారణకు సంబంధించిన సమస్యలూ తలెత్తుతాయి. ముఖ్యంగా శాచురేటెడ్‌ కొవ్వుని ఎంచుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ శాతం పెరుగుతుంది. దాంతో గుండెకు రక్తం తీసుకెళ్లే రక్తనాళాల్లో ఆటంకాలు ఏర్పడి హృద్రోగాలు మొదలవుతాయి. అసలు గుండెజబ్బులు వస్తాయా లేదా.. రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతం ఏ మేరకు ఉందనేది తెలుసుకునేందుకు లిపిడ్‌ ప్రొఫైల్‌ పరీక్ష ఉంటుంది. దాన్ని చేయించుకుంటే మొత్తం కొలెస్ట్రాల్‌లో చెడు శాతం ఎంత ఉంది (ఎల్‌డిఎల్‌), మేలు చేసే కొలెస్ట్రాల్‌ (హెచ్‌డిఎల్‌).. ట్రైగ్లిజరైడ్ల వంటి వివరాలు తెలుస్తాయి. ఒకవేళ రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు అదుపులో లేవని తేలితే.. మధుమేహం, అధికరక్తపోటు ఉన్నవారికి  గుండెజబ్బులొచ్చే ఆస్కారం ఎక్కువని చెబుతున్నారు వైద్యులు. 

ఎంత మోతాదులో.. 

ప్రతీ వ్యక్తికీ రోజువారీ అవసరమయ్యే శక్తిలో కొంత శాతం కొవ్వు నుంచి అందడం తప్పనిసరి. కాబట్టి ఆహారంలో పదిహేను, ఇరవై శాతం వరకూ కొవ్వు ఉండేలా చూసుకోవాలి. ఏ నూనె అయినా ఒక గ్రాము తీసుకుంటే దాదాపు తొమ్మిది కెలొరీలు అందుతాయి. అందుకే ఒక రోజులో నాలుగు చెంచాలకు మించి నూనె వాడకూడదు. అయితే ఇది అందరికీ వర్తించదు. చిన్నపిల్లలకీ, గర్భిణులకూ కొవ్వు పదార్థం అతి ముఖ్యమైన పోషకం గనుక సాధారణ కొవ్వు పదార్థాలనే ఎంచుకోవచ్చు. అతిగా మాత్రం కాదు. అధిక మోతాదులో కొవ్వు పదార్థాలను ఇష్టపడే వాళ్లు మేలైన రకాలను ఎంచుకుంటే మంచిది.  

కొలెస్ట్రాల్‌ కూడా అంతే. అది కూడా శరీరానికి అవసరమే కానీ.. అతిగా కాదు. మనం తీసుకునే డైటరీ ఫ్యాట్‌ని బట్టి రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులపై ప్రభావం పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శాచురేటెడ్‌, ట్రాన్స్‌ఫ్యాట్లు రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయుల్ని పెంచుతాయి కాబట్టి బదులుగా పాలీ అన్‌శాచురేటెడ్‌, మోనో అన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. శుద్ధిచేసిన కార్బోహైడ్రేట్లను మానేయాలి. గుండెజబ్బుల ప్రమాదం ఉన్నవారు రోజుకి రెండొందల మిల్లీగ్రాముల వరకూ, ఎలాంటి సమస్యలూ లేనివారు మూడొందల మిల్లీగ్రాముల వరకూ కొలెస్ట్రాల్‌ ఉన్న పదార్థాలను ఎంచుకోవచ్చు. 

రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ వల్ల గుండెజబ్బుల సమస్య పెరుగుతుంది కాబట్టి కొవ్వు పదార్థాలను ఓ పద్ధతి ప్రకారం తీసుకోవాలి. ఏ నూనెల్ని ఎంత మోతాదులో వాడుతున్నారనేదీ గమనించుకోవాలి. ఒక నూనెలో అన్నిరకాల ఫ్యాటీయాసిడ్లు అందవు కాబట్టి వంటనూనెల్ని కలిపి వాడాలి. వేరుసెనగ, రైస్‌బ్రాన్‌, నువ్వులనూనె ఏదో ఒకటి తీసుకుని దాంట్లో కనోలా, సోయాబీన్‌, ఆవనూనెల్లో ఏదో ఒకటి కలపాలి. రెండూ సమపాళ్లలో కలిపి వాడుకోవాలి. సలాడ్లకు ఆలివ్‌నూనె, వేపుళ్లకు వేరుసెనగనూనె, ఇతర వంటకాలకు సోయాబీన్‌ నూనెల్ని ఎంచుకోవచ్చు. చాలా మంది ఆలివ్‌నూనెను ఎంతయినా తీసుకోవచ్చని అనుకుంటారు. ఏ రకమైనా మోతాదును మించనివ్వకూడదు. 
ఈ జాగ్రత్తలూ అవసరమే.. 

చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించాలంటే అవిసెగింజలూ, తృణధాన్యాలూ, గింజధాన్యాలూ, నట్స్‌ లాంటివి ఎంచుకోవాలి. వీటి వల్ల మేలు చేసే కొలెస్ట్రాల్‌ అందుతుంది. పొట్టుధాన్యాలను తీసుకోవాలి. చేపలూ, స్కిన్‌లెస్‌ చికెన్‌, గుడ్డులోని తెల్లసొన, పాల పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే ఎసెన్షియల్‌ ఫ్యాటీయాసిడ్లు అందుతాయి. 

వేపుళ్ల వల్ల కొవ్వు స్థాయులు పెరుగుతాయి. బదులుగా ఆవిరిమీద ఉడికించడం, గ్రిల్‌ చేయడం, దోరగా వేయించడం లాంటి పద్ధతుల్ని ఎంచుకోవాలి. గ్రేవీలూ, ఇతర కూరల్లాంటివి ఫ్రిజ్‌లో కొన్ని గంటలపాటు ఉంచితే, అనవసర కొవ్వు గడ్డకట్టుకుని పైన పేరుకుంటుంది. దాన్ని తీసేసి వాడుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించుకుని, మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుకోవాలంటే.. తగినంత శారీరక శ్రమా అవసరమే.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
భోజనం చేసేప్పుడు పావువంతు కడుపును ఖాళీగా ఉంచుకోవాలని పెద్దలు చెబుతుంటారు. కడుపునిండా తింటే ఆహారం సరిగా జీర్ణం కాకపోవటంతో పాటు ఒంట్లో కొవ్వు మోతాదూ పెరుగుతుందనేది అందులోని పరమార్థం. మరి అలా కొవ్వు పెరగకుండా చూసుకోవాలంటే ఆహారంలో వీటినీ భాగంగా చేసుకొని చూడండి.

  • గుడ్లు: ఉదయం పూట ప్రోటీన్లను తీసుకుంటే చాలాసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. అందువల్ల రోజూ గుడ్డు తినటం మంచిది. ఒక గుడ్డులో 75 కేలరీలే ఉంటాయి. ఇతర పోషకాలతో పాటు 7 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్‌ లభిస్తుంది. గుడ్డును జీర్ణం చేసుకునేప్పుడు శరీరం ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తుంది కూడా. కొలెస్ట్రాల్‌ మోతాదు ఎక్కువగా గలవారు వారానికి ఎన్ని గుడ్లు తినొచ్చో డాక్టర్‌ని అడిగి తెలుసుకోవటం మేలు.
  • ఆకుకూరలు: ఇవి విటమిన్‌ కె నిలయాలు.
  • సాల్మన్‌ చేపలు: ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు వీటితో దండిగా లభిస్తాయి.
  • వెన్న తీసిన పాలు: ఇందులో ప్రోటీన్‌, క్యాల్షియం దండిగా ఉంటాయి. వెన్న తీసినప్పటికీ ఈ పాలు తాగినప్పుడు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. ఆలస్యంగా జీర్ణమవుతాయి. ఇవి బరువు తగ్గటాన్ని ముఖ్యంగా నడుం వద్ద కొవ్వు పేరుకుపోవటాన్ని తగ్గిస్తాయి.
  • చిక్కుళ్లు: బీన్స్‌, గోరుచిక్కుడు, చిక్కుడు వంటి కూరగాయల్లో ప్రోటీన్లు, పీచు దండిగా ఉంటాయి. తక్కువ కేలరీలతోనే చాలాసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి.
  • గింజ పప్పులు: బాదంపప్పు, జీడిపప్పు వంటి గింజపప్పులు (నట్స్‌) త్వరగా ఆకలి వేయకుండా చూస్తాయి. వీటిల్లో ప్రోటీన్‌, పీచు, గుండెకు మేలు చేసే కొవ్వులు ఉంటాయి. అయితే వీటిని పరిమితంగానే తినాలని గుర్తుంచుకోవాలి. అప్పుడే ఇవి బరువు తగ్గటానికి, కొలెస్ట్రాల్‌ స్థాయులు అదుపులో ఉండేందుకు దోహదం చేస్తాయి.
  • పుచ్చపండు: ఇందులో నీరు అధికంగా ఉంటుంది. కొద్దిగా తిన్నా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. కేలరీలూ తక్కువే. పైగా ఇందులో లైకోపేన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ దండిగా ఉంటుంది. ఏ, సి విటమిన్లూ లభిస్తాయి.
  • పీర్స్‌, యాపిల్స్‌: వీటిని పొట్టు తీయకుండా తింటే పీచు మరింత ఎక్కువగా లభిస్తుంది. త్వరగా కడుపునిండిన భావన కలిగిస్తాయి. చాలాసేపు ఆకలి వేయకుండా చూస్తాయి. నమిలి తినటం వల్ల కేలరీలూ ఖర్చవుతాయి.
  • బత్తాయి వంటి పుల్లటి పండ్లు: వీటిల్లో విటమిన్‌ సి, విటమిన్‌ ఈ,  అత్యవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు దండిగా ఉంటాయి.
  • బెర్రీలు: స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి పండ్లలోనూ పీచు, నీరు అధికంగా ఉంటాయి. పైగా ఇవి తీయగా ఉండటం వల్ల తిన్న తృప్తీ కలుగుతుంది. బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లూ దండిగానే ఉంటాయి. 
  • టమోటాలు: వీటిల్లోని లైకోపేన్‌ సమర్థవంతమైన యాంటీ ఆక్సిడెంటుగా పనిచేస్తుంది.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
వయస్సులో ఉన్నప్పుడు ఏం తిన్నా.. ఎలా తిరిగినా రోజులు బాగానే గడిచిపోతాయి. ఆ ఉరకలెత్తే వయస్సులో శారీరక సామర్థ్యం అంత  బాగా ఉంటుంది! కానీ 30లు దాటుతున్న కొద్దీ పరిస్థితి క్రమేపీ మారిపోతుంటుంది. ఎప్పుడూ లేనిది నెలకో రెణ్ణెల్లకో ఏదో ఒక చిన్నాచితకా ఆరోగ్య సమస్య పలకరించటం. మళ్లీ కొద్దిరోజుల్లో సర్దుకోవటం! చాలామందికి నలభైల్లో పడిన తర్వాత బండి ఇలాగే నడుస్తుంది! శరీరం కొద్దికొద్దిగా పట్టు సడలుతోందనటానికి ఇదే తార్కాణం. మరి దీన్ని అడ్డుకునేదెలా? 50, 60 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఎటువంటి శారీరక సమస్యా దరిజేరకుండా.. దృఢత్వం జారకుండా చక్కటి ఆరోగ్యాన్ని నిలబెట్టుకునేదెలా? అందుకోసం..  పాటించండీ ఈ ఐదు సూత్రాలు!

  • ముప్ఫై ఏళ్లు దాటుతుంటే సహజంగానే స్త్రీపురుషులు ఇరువురూ కొద్దిగా బరువు పెరుగుతుంటారు. ముఖ్యంగా ప్రసవానంతరం స్త్రీలు కొంత బరువు పెరగటం చూస్తూనే ఉంటాం. అయితే ఏ రకంగా చూసుకున్నా కూడా బరువు పెరగటం మంచిది కాదు. అందుకోసం పద్ధతి ప్రకారం తప్పనిసరిగా రోజూ ఏదో ఒక వ్యాయామం చెయ్యటం చాలా అవసరం. బద్ధకం ముంచెత్తకుండా ఉండేందుకు నలుగురితో కలిసి వ్యాయామానికి వెళ్లేందుకు వీలుగా వాకింగ్‌ లాంటివి ఎంచుకోవచ్చు. నిజానికి సాధారణ వ్యాయామాలన్నింటిలోకీ ఈత ఉత్తమమైనది. అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు కాబట్టి తేలికైన, సమర్థమైన వాకింగ్‌ను ఎంచుకోవచ్చు. వారానికి కనీసం నాలుగు రోజులు గుండె బలాన్ని పెంచే వాకింగ్‌, జాగింగ్‌, రన్నింగ్‌ చెయ్యాలి. మిగిలిన రోజుల్లో జిమ్‌ వ్యాయామాల వంటివి ఎంచుకోవచ్చు. బరువు పెరగకుండా ఉండటమే కాదు.. చిన్నాచితకా జబ్బుల బారిన పడకుండా రోగనిరోధక శక్తి బలపడేందుకు, శరీరంలో జీవక్రియలు సజావుగా సాగేందుకు కూడా నిత్య వ్యాయామం దోహదపడుతుందని మరువద్దు. 


  • ఈ రోజుల్లో ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏమిటో అవగాహన పెంచుకోవటం చాలా అవసరం. ప్రతిపూటా వరి అన్నం, గోధుమ వంటి పిండి పదార్ధాలనే ఎక్కువెక్కువగా తినటం సరికాదు. వీటిని కొద్దిగా తీసుకోవాలి. అది కూడా ముడివైతే మంచిది. (మైదా వంటి తేలికగా జీర్ణమయ్యే రిఫైన్డ్‌ పిండ్లు బాగా తగ్గించెయ్యాలి) ప్రతి భోజనంలోనూ ప్రధానంగా పప్పు, మాంసం వంటి మాంసకృత్తులు దండిగా ఉండాలి. ఇక ప్రతి పూటా కూరలు, ఆకుకూరలు దండిగా తినాలి. కూరలను, పండ్లను చెక్కు తియ్యకుండా తినటం, లేదా సాధ్యమైనంత తక్కువగా తియ్యటం మంచిది. నూనె, కొవ్వు, స్వీట్లు బాగా తగ్గించెయ్యాలి. రోజూ ఒకే సమయానికి తినటం అలవాటు చేసుకోవాలి. వారాంతాల్లో-ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువెక్కువగా తినటం మంచిది కాదు. 


  • ఇన్నాళ్లుగా ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేకపోయినా ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుందని గుర్తించి.. మన శరీరం మీద ఒక కన్నేసి ఉంచటం చాలా అవసరం. ముఖ్యంగా 30-35 ఏళ్లు వచ్చినప్పుడు ఏడాదికి ఒకసారైనా కొన్ని తేలికపాటి పరీక్షలు చేయించుకోవటం మంచిది. ముఖ్యంగా బీపీ చూపించుకోవటం, మధుమేహం వస్తోందేమో తెలుసుకునేందుకు, రక్తహీనత-అధిక కొలెస్ట్రాల్‌ వంటి సమస్యలేమైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు రక్తపరీక్షలు చేయించుకోవాలి. స్త్రీలైతే- పాప్‌స్మియర్‌ పరీక్ష (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ వస్తోందేమో ముందే గుర్తించేందుకు), 40 ఏళ్లు దాటిన తర్వాత రెండేళ్లకొకసారైనా మామోగ్రామ్‌ పరీక్ష (రొమ్ము క్యాన్సర్‌ ఆనవాళ్లను పసిగట్టేందుకు) చేయించుకోవటం ఉత్తమం. పరీక్షల విషయంలో తాత్సారం అంత మంచిది కాదు! మన శరీరం పట్ల మనం శ్రద్ధ కనబరుస్తున్నామనటానికి ఇదే తార్కాణం. 


  • 30 ఏళ్ల వయసనేది ఎవరైనా ఇంట్లోనూ, పనిలోనూ కూడా చాలా చురుకుగా ఉండే సమయం. కెరీర్‌ పరంగా కూడా చాలా వేగంగా ఎదిగే సమయం. పిల్లల పెంపకం, డబ్బు దాచుకోవటం, భవిష్యత్‌ ప్రణాళికలు వేసుకోవటం, సామాజిక సంబంధాలు పెంచుకోవటం.. ఇవన్నీ కూడా ఒక్కసారిగా మీద పడతాయి. ఈ ఒత్తిడికి ఉక్కిరిబిక్కిరి అవుతూ.. ఏదైనా కాస్త అటూఇటూ అయితే మానసికంగా నిరాశలోకి జారిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. అన్నింటినీ ఒక్కసారే నెత్తినేసుకుని వైఫల్యాన్ని కొని తెచ్చుకోకూడదు. జీవితాన్ని ప్రణాళికా బద్ధంగా మలుచుకోవటం, సమయ పాలన, 'ఈ క్షణం మనది' అనుకుంటూ కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో జీవితాన్ని ఆనందించటం ముఖ్యం. ప్రతి పనిలోనూ సానుకూల దృక్పథం ప్రదర్శించటం అవసరం. మానసిక నిశ్చింతకు అవసరమైతే యోగాభ్యాసం, ధ్యానం వంటివి కూడా ఉపకరిస్తాయి. 


  • కచ్చితంగా రావాలనేం లేదుగానీ... కొన్ని వ్యాధులు, రుగ్మతలు కుటుంబ పరంగా వచ్చే ఆస్కారం లేకపోలేదు. అందుకే కుటుంబంలో, వంశంలో ఇంతకు ముందు ఎవరికైనా గుండె జబ్బులు, హైబీపీ, మధుమేహం, క్యాన్సర్లు, థైరాయిడ్‌ సమస్యలు, కీళ్ల వాతం వంటివి ఉన్నాయేమో తెలుసుకుని ఉండటం.. వీలైతే సాధ్యమైనంత వరకూ మనకు రాకుండా 20-30 ఏళ్ల వయసు నుంచే నివారణ చర్యలు ఆరంభించటం చాలా చాలా అవసరం. దీని విషయమై కుటుంబ వైద్యులతో ముందే చర్చించటం శ్రేయస్కరం! 
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
  అరటి పండ్లు కడుపులో ఆమ్లాల్ని తగ్గించే ప్రకృతి సిద్ధ యాంటిసిడ్లగా పని చేస్తాయి. అరటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతూ, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పొటాషియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల పక్షవాతం ముప్పు తక్కువగా ఉంటునట్లు పలు అధ్యయనాల్లో గుర్తించారు. అరటి వంటి పీచు అధికంగా ఉండే ఆహార పదార్థాలు గుండె జబ్బుల్ని నివారించమే కాకుండా ఎముకల ఆరోగ్యాన్నీ కాపాడతాయి. వీటిలో ఉండే యాంటీసిడ్ ప్రభావం కడుపులో పుండ్లనూ తగ్గిస్తుంది.

  • అరటిపండుతో పోలిస్తే.. అరటికాయలో చెక్కర, ఉప్పు తక్కువగా ఉంటాయి. ఫలితంగా ఆరోగ్యానికి మంచిది.
  • ఎ విటమిన్, పొటాషియం, పీచు వంటి పోషకాలను అరటికాయల నుంచి పొందవచ్చు.
  • అరటిపువ్వుల్లో పీచుతో పాటు మాంసకృత్తులు అస్శాచురేటడ్ ఫ్యాట్ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిల్లో విటమిన్ ఇ తోపాటు ఫ్లవనాయిడ్లు అధికంగా ఉంటాయి. ఫలితంగా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
  • అరటిపువ్వును తరచూ తీసుకోగలిగితే, కొన్ని రకాల అనారోగ్యాలు.. ముఖ్యంగా మలబద్ధకం, ఉబ్బసం, అల్సర్ వంటి వాటిని నివారించవచ్చు

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
పండ్లల్లో మన శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శక్తినివ్వడంతో పాటు వీటితో పీచు (ఫైబర్) కూడా లభిస్తుంది. కాబట్టి రోజూ పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే జామ పండు తింటే జలుబు చేస్తుందని, అరటిపండు తింటే దగ్గు ఎక్కువవుతుందని.. ఇలా ఎంతోమంది రకరకాలుగా అపోహ పడుతుంటారు. వీటిల్లోని నిజానిజాలేంతో తెలుసుకుందామా....

  •  మధుమేహులు పండ్లు తినరాదు.
మధుమేహులు పూర్తిగా పండ్లకు దూరంగా ఉండాల్సిన పనిలేదు. వాళ్లు కూడా రోజూ మితంగా తినొచ్చు. అయితే చెక్కరల శాతం ఎక్కువగా ఉండే అరటి, మామిడి, సీతాఫలం, పనసపండు వంటి వాటికి దూరంగా ఉండాలి.

  • జలుబు చేసినప్పుడు జామ పండు తింటే అది మరింత తీవ్రమవుతుంది.
జామపండులో విటమిన్ సి, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. రోగ నిరోధకశక్తిని పెంపొందించే ఇతర పోషకాలూ నిండి ఉంటాయి. అందువల్ల జలుబు, దగ్గుతో పోరాడడంలో జామ పండ్లు మనకు తోడ్పడతాయి.

  • బాగా మగ్గిన పండ్లు హాని చేస్తాయి.
రంగు, ఆకారం మారనంత వరకు నిరభ్యంతరంగా అన్ని పండ్లను తినొచ్చు. చెడిపోయినవి తింటే మాత్రం ఇబ్బందులు కలగొచ్చు. అంతే గానీ బాగా మగ్గిన పండ్లను తింటే ఎలాంటి హానీ కలగదు.

  • రోజూఒకఆపిల్ తినే అలవాటుడాక్టర్ నుండి దూరంగాఉంచుతుంది.
ఒక్క ఆపిల్ మాత్రమే కాదు. అన్ని పండ్లల్లోనూ విటమిన్లు, ఖనిజాలు, యాంటఆక్సిడెంట్లు, పీచు పదార్ధలు వంటివి ఉంటాయి. ఎలాంటి పండు తిన్నా డాక్టర్ కు దూరంగా ఉండొచ్చు. అయితే రోజూ తినాలన్నదే ప్రధానమని గుర్తుంచుకోవాలి.
  • పండ్లు తింటే దంతక్షయానికి దారితీస్తుంది.
యాపిల్, నారింజ వంటివి దంతాలు శుభ్రంగా ఉండేందుకు తోడ్పడతాయి. అయితే  కోన్ని రకాల పండ్లు తిన్నాక నోటిని సరిగా శుభ్రం చేసుకోవడం మాత్రం మరవరాదు. లేకపోతే దంతక్షయం ఏర్పడొచ్చు.

  • పండ్లల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి వీలైనని ఎక్కువగా తినాలి.
మామూలు చెక్కరలతో పాటు పండ్లల్లో కేలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కొన్ని పండ్లలో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ వాటిని మితంగానే తినాలి. చెక్కర మితిమీరితే కేలరీల మోతాదూ మించి పోవటానికి దారితీస్తుంది. ఇది బరువు పెరగటనికి దోహదం చేస్తుంది.

  • పండ్లను పడుకునే ముందు తింటేనే మంచిది.
ఉదయం, సాయంత్రం వేళల్లో మన శరీరానికి గ్లూకోజు, శక్తి అవసరాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సమయంలో పండ్లను తినం మంచిది. పడుకునే ముందు తింటే అప్పటికే బోజనం చేసి ఉంటాం కాబట్టి శరీరంలో మరికొన్ని కేలరీలు పోగవుతాయి. ఇది బరువు పెరగటానికి దారితీస్తుంది.