Articles by "obesity"
obesity లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
మన గుండె నిరంతరం లబ్‌డబ్‌మని కొట్టుకుంటూ ఉంటుంది కదా. ఇది సమర్థవంతంగా పనిచేస్తేనే శరీరంలోని అన్ని భాగాలకు తగినంత రక్తం పంప్‌ అవుతుంది. సాధారణంగా మన గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఈ వేగం (పల్స్‌) మన శరీర సామర్థ్యాన్నే కాదు.. గుండె ఆరోగ్యాన్నీ, ఇతర సమస్యలనూ పట్టి చూపుతుంది. అందువల్ల గుండె వేగం గురించి అవగాహన కలిగి ఉండటం అవసరం.  

గుండె సాధారణ (నార్మల్‌) వేగం ఒకొకరిలో ఒకోరకంగా ఉంటుంది. వయసు పెరుగుతున్నకొద్దీ గుండె వేగంలో మార్పులొస్తాయి. మణికట్లు, మోచేయి, మెడ, పాదంపైన పల్స్‌ను స్పష్టంగా గుర్తించొచ్చు. ఈ భాగాల్లో వేలిని పెట్టి 60 సెకండ్లలో నాడి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో లెక్కిస్తే గుండె వేగం తెలుస్తుంది. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మన శరీరానికి రక్తసరఫరా అంతగా అవసరముండదు. కాబట్టి గుండె కొట్టుకునే వేగం కూడా తగ్గుతుంది. ఎలాంటి జబ్బులూలేని పెద్దవారిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గుండె 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. తీవ్రంగా శారీరక శ్రమ, వ్యాయామం చేసేవారికి, క్రీడాకారుల్లో గుండె కండరం బలంగా ఉండటం వల్ల విశ్రాంతి సమయంలో ఈ నాడి వేగం 60 కన్నా తక్కువగా ఉండొచ్చు. రక్తపోటును తగ్గించే బీటా బ్లాకర్‌ మందులు, గుండెలయను సరిచేసే మందులు వేసుకునేవారు గుండెవేగంపై ఓ కన్నేసి ఉంచటం మంచిది. ఇలాంటి వారిలో ఏవైనా తేడాలు కనిపిస్తే మందుల మోతాదు మార్చటమో, వేరే మందులకు మారటమో చేయాల్సి ఉంటుంది. గుండెవేగం చాలా తక్కువగా ఉన్నా, తరచుగా గుండెవేగం పెరుగుతున్నా, ముఖ్యంగా బలహీనత, తలతిప్పు, వణుకు వంటివి ఉంటే వెంటనే డాక్టర్‌కి చూపించుకోవటం మంచిది. ఏవైనా సమస్యలుంటే ముందుగానే జాగ్రత్త పడే అవకాశముటుంది.  

వేగాన్ని పెంచే కారకాలు 

  • భావోద్వేగాలు: ఒత్తిడి, ఆందోళన, విచారం, సంతోషం వంటి భావోద్వేగాలకు గురైనప్పుడూ గుండెవేగం పెరుగుతుంది. 
  • శరీర భంగిమ: విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, కూచున్నప్పుడు, నిలబడినప్పుడు గుండె వేగం ఒకేలా ఉంటుంది. అయితే కొన్నిసార్లు నిలబడిన వెంటనే 15-20 సెకండ్ల పాటు ఇది కాస్త పెరగొచ్చు. కానీ కొద్దిసేపట్లోనే వేగం సర్దుకుంటుంది. 
  • వూబకాయం: భారీ వూబకాయుల్లో విశ్రాంతి సమయంలో గుండెవేగం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది సాధారణంగా 100కు మించకపోవచ్చు. 
  • ఉష్ణోగ్రత: వాతావరణంలో ఉష్ణోగ్రత, తేమ పెరిగినపుడు గుండె మరింత ఎక్కువగా రక్తాన్ని పంప్‌ చేయాల్సి వస్తుంది. దీంతో గుండె నిమిషానికి 5-10 సార్లు ఎక్కువగా కొట్టుకుంటుంది. 

వేగాన్ని ఎంతవరకు పెంచొచ్చు?

వ్యాయామం చేసినపుడు గుండె సాధ్యమైనంత ఎక్కువగా కొట్టుకునేలా చూసుకోగలిగితే మంచిదని నిపుణులు సూచిస్తుంటారు.
అయితే ఈ గరిష్ఠ గుండెవేగాన్ని గుర్తించటమెలా? దీనికి తేలికైన సూత్రముంది. 220లోంచి వ్యక్తి వయసును తీసేస్తే.. వచ్చే సంఖ్యను గరిష్ఠ గుండెవేగంగా పరిగణించొచ్చు. అంటే 40 ఏళ్ల వ్యక్తి నిమిషానికి గరిష్ఠంగా 180 సార్లు గుండె కొట్టుకునేవరకు వ్యాయామం చేయొచ్చన్నమాట. అయితే ఇది ఆయా వ్యక్తుల సామర్థ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని మరవరాదు. కచ్చితంగా ఎంతమేరకు వ్యాయామం చేయాలనేది డాక్టర్ల సూచనల మేరకు నిర్ణయించుకోవాలి.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
అధికబరువుతో రకరకాల అనర్థాలు పొంచి ఉన్న మాట నిజమే. కానీ తక్కువ బరువునూ తక్కువగా అంచనావేయటానికి వీల్లేదు. ఎందుకంటే శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి (బీఎంఐ) సాధారణ స్థాయిలో (18.5-25.9) గలవారి కన్నా తక్కువ బీఎంఐ (18.5, అంతకన్నా తక్కువ) గలవారికి రకరకాల కారణాలతో మరణించే ముప్పు 1.8 రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు.
మామూలు వ్యక్తులతో పోలిస్తే వూబకాయులకు (బీఎంఐ 30-34.9) మరణ ముప్పు 1.2 రెట్లు మాత్రమే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక బీఎంఐ 35, అంతకంటే ఎక్కువగల వుబకాయులకు ఈ ముప్పు 1.3 రెట్లు ఎక్కువని తేలింది. అంటే వూబకాయం కంటే తక్కువ బరువే ఎక్కువ ప్రమాదకరంగా పరిణమిస్తోందన్నమాట. మన బీఎంఐ కేవలం శరీరంలోని కొవ్వును మాత్రమే కాదు. కండరాల మోతాదునూ ప్రతిబింబిస్తుంది. 
అందువల్ల వూబకాయాన్ని తగ్గించే విషయంలో కొవ్వు, కండరాల, ఎముక మోతాదులు తగినంత స్థాయిలో ఉండేలా చూసుకోవటం కీలకమని అధ్యయనానికి నేతృత్వం వహించిన వైద్యులు చెబుతున్నారు.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
ప్రశ్న: డైటింగ్, వ్యాయామంతో బరువు తగ్గుతుందా...?

జవాబు: బీఎంఐ 30, అంతకంటే ఎక్కువగా ఉన్న వారిలో డైటింగ్, వ్యాయామం మాత్రమే బరువు తగ్గడానికి సరిపోవు. పరిమిత ఆహారం, వ్యాయామం స్థూలకాయం రాకుండా చూసుకోడానికి, ఫిట్నెస్ కాపాడుకోడానికి ఉపయోగపడతాయి. కానీ ఒకసారి స్థూలకాయం వస్తే వీటిద్వారా మాత్రమే శాశ్వతంగా బరువు తగ్గడం సాధ్యం కాదు. నూటికి తొంభైమంది డైటింగ్, వ్యాయామం చేసి బరువు తగ్గించుకోవడంలో విఫలమవుతారు. అయితే మొదట్లో కొన్ని కిలోలు బరువు తగ్గించుకోడానికి ఇవి ఉపయోగపడవచ్చు. కానీ ఇది తాత్కా లికమే. డైటింగ్, వ్యాయామంతోనే స్థూలకాయం ఎందుకు తగ్గదంటే, ఇవి కొవ్వు సెట్పాయింట్ను మార్చలేవు. డైటింగ్ చేసే సమయంలో ఆహారం తక్కువ గా తీసుకుంటాం. దీంతో కడుపు నిండదు. ఫలితంగా ఆకలిని పెంచే గ్రెలిన్ హార్మోన్ పెరిగి ఆకలి పెరుగుతుంది. అలాగే చిన్నపేగులలో తయారయ్యే ఆకలిని తగ్గించే జీఎల్పీ-1 హార్మోన్ ఉత్పత్తి తగ్గి, ఆకలి పెరిగి పోతుంది. కొవ్వు సెట్పాయింట్ ప్రభావం వల్ల డైటింగ్ చేసిన ప్రతిసారీ జీవక్రియలు నెమ్మదించి శక్తి వేడి రూపంలో బయటకువెళ్లడం ఆగిపోతుంది. డైటింగ్ ఒక సమయానికి మించి కొనసాగిస్తే ఈ మార్పులు విపరీతంగా పెరిగి ఆకలికి తట్టుకోలేక తెలియకుండానే తినేస్తారు. దీంతో తిరిగి బరువు పెరుగుతారు.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
ప్రశ్న: బరువు తగ్గాలంటే లైపోసక్షన్, కూల్ స్కల్ప్టింగ్ అవసరమా.

జవాబు: ఈ పద్ధతులు బరువు తగ్గడానికి ఉపయోగపడవు. చాలామంది బరువు తగ్గించుకోడా నికి లైపోసక్షన్, కూల్ స్కల్ప్టింగ్లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఇవి బాడీ షేపింగ్కు ఉపయోగపడే కాస్మెటిక్ ఆపరేషన్లు. ఇవి స్థూలకాయ సమస్యను పరిష్కరించలేవు. ఈ విధానాల వల్ల కూడా శరీరంలోని కొవ్వు సెట్పాయింట్లో మార్పు ఉండదు. డైటింగ్, వ్యాయామం ద్వారా బరువు తగ్గగలిగే వారికి లైపోసక్షన్, కూల్ స్కల్ప్టింగ్ అవసరం లేదు. అలా తగ్గలేని వారు లైపోసక్షన్, కూల్ స్కల్ప్టింగ్ ద్వారా కూడా తగ్గలేరు. పైగా కొంతకాలం తర్వాత ఇంకాస్త బరువు పెరుగుతారు. 

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
ప్రశ్న: తక్కువ క్యాలరీలు ఉండే ఆహారపదార్థాలు (వెరీ లో-క్యాలరీ డైట్) వల్ల స్థూలకాయం తగ్గించుకోవచ్చా?

జవాబు: లేదు. తక్కువ క్యాలరీలు ఉండే ఆహార పదార్థాల వల్ల ఉపయోగం తాత్కాలికమే. మార్కెట్లో బరువు తగ్గడానికి తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రోటీన్లు ఉండే హెర్బల్ ఆహారం లభ్యమవుతోంది. కానీ వీటివల్ల కొవ్వు సెట్ పాయింట్లో మార్పు ఉండదు. ఈ పదార్ధాలు వాడటం వల్ల కొంత బరువు తగ్గినప్పటికీ సెట్పాయింట్ ప్రభావం వల్ల ఆరునెలల నుంచి ఐదేళ్ల లోపల మనం కోల్పోయిన బరువు తిరిగి పెరుగే అవకాశం వుంది.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates

ప్రశ్న: పొట్ట చుట్టూ కొవ్వు పేరుకొని పోవడం ప్రమాదకరమా.


జవాబు: అవును. నిజానికి ఒళ్లంతా కొవ్వు పేరుకుపోవడం ద్వారా వచ్చే స్థూలకాయం కంటే పొట్టచుట్టూ కొవ్వు పేరుకునిపోవడం అత్యంత ప్రమాదకరం. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుని పోవడాన్ని సెంట్రల్ ఒబేసిటీ అంటారు. మన పొట్ట చుట్టూ అనేక పొరలు ఉంటాయి. సెంట్రల్ ఒబేసిటీలో చర్మం కిందనే కాకుండా, కండరాల లోపలివైపు, జీర్ణాశయం, పేగుల చుట్టూ కూడా కొవ్వు పేరు కొనిపోతుంది. డయాబెటిస్, హైబీపీ, రక్తంలో కొవ్వు శాతం పెరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశం... సాధారణ స్థూలకాయం కంటే సెంట్రల్ ఒబేసిటీలో చాలా ఎక్కువ. సెట్పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్, దాని ప్రాధాన్యం స్థూలకాయ సమస్యతో సతమతమవుతున్న ప్రతి ఒక్కరూ ‘సెట్ పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్’ అంటే ఏమిటో తెలుసుకోవాలి. మనకు రోజువారీ పనులకు, అన్ని జీవ క్రియలకు కావాల్సిన శక్తి మనం తీసుకునే ఆహారం నుంచే వస్తుంది. మనం తీసుకున్న ఆహారం పేగులలో జీర్ణమై, రక్తం లోకి చేరుతుంది. సగటున మనిషికి రోజుకు 2000 క్యాలరీల శక్తి అవసరమవుతుంది. అవసరానికి మించి క్యాలరీలు ఇచ్చే ఆహారాన్ని మనం తీసుకుంటే, శరీర అవసరాలకు పోగా మిగిలిన శక్తిని శరీరం కొవ్వురూపంలోకి మార్చుకొని నిలువ చేసుకుంటుంది. అయితే శరీరంలో ఎంత కొవ్వు నిల్వ ఉండాలి అన్నది ముందుగానే నిర్ణయమై ఉంటుంది. ఈ విలువను ‘సెట్పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్’ అంటారు.

ఉదాహరణకు 60 కేజీలు ఉండాల్సిన వ్యక్తి 120 కేజీల బరువు ఉన్నాడనుకుందాం. అంటే ఆ వ్యక్తి 60 కేజీల అదనంగా బరువున్నట్లు. అంటే ఆ వ్యక్తి కొవ్వు సెట్పాయింట్ 60 కేజీలు. కొంతమంది తక్కువ తింటున్నప్పటికీ లావుగా ఉంటారు. ఇంకొంత మంది ఎక్కువ తింటున్నప్పటికీ సన్న గానే ఉంటారు. దీనికి కారణం లావుగా ఉన్న వ్యక్తుల్లో సెట్ పాయింట్ ఎక్కువగా, సన్నగా ఉన్నవారిలో కొవ్వు సెట్ పాయింట్ తక్కువగా ఉంటుంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల (కూల్డ్రింక్లు, ఐస్క్రీములు, స్వీట్లు, కేక్లు, బర్గర్లు, పిజ్జాలు, బిస్కట్లు మొదలైన వాటివల్ల) సెట్ పాయింట్ పెరుగుతుంది. ఒకసారి పెరిగిన సెట్పాయింట్ మళ్ళీ తగ్గదు. ఈ సెట్పాయింట్ మన మనసు అధీనంలో ఉండదు. ఇది మన శరీర ఉష్ణోగ్రత సెట్పాయింట్ లాంటిదే. మన శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల ఫారిన్హీట్గా సెట్ అయి ఉంటుంది. దీనిని మనసులో అనుకుని మనం ఎలా మార్చలేమో, అలాగే ‘సెట్పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్’ను కూడా మార్చలేము.

ఈ సెట్పాయింట్ జీర్ణవ్యవస్థలో తయారయ్యే కొన్ని హార్మోన్ల అధీనంలో ఉంటుంది. వీటిలో ముఖ్యమైనవి గ్రెలిన్, జీఎల్పీ-1 (గ్లూకగాన్ లైక్ పెప్టైడ్-1). గ్రెలిన్ జీర్ణా శయం పైభాగంలో తయారవుతుంది. ఇది ఆకలిని పెంచే హార్మోన్. పొట్ట ఖాళీగా ఉంటే ఈ హార్మోన్ ఎక్కువగా తయారై ఆకలి పెరుగుతుంది. కడుపునిండా ఆహారం తీసుకుంటే ఈ హార్మోన్ తగ్గి ఆకలి తగ్గుతుంది. అలాగే చిన్న పేగు చివరి భాగంలో జీఎల్పీ-1 హార్మోన్ తయారవుతుంది. ఇది ఆకలిని తగ్గించే హార్మోన్. చిన్నపేగు చివరి భాగంలోకి జీర్ణం కాని ఆహారం వస్తే జీఎల్పీ-1 ఎక్కువగా తయారై, ఆకలి తగ్గుతుంది. పొట్ట ఖాళీగా ఉంటే ఈ హార్మోన్ తగ్గి ఆకలి పెరుగుతుంది. అంటే మనం ఎంత ఆహారం తీసుకుంటాం, మన శరీరంలో ఎంత కొవ్వు నిల్వ ఉండాలి అన్నది జీర్ణవ్యవస్థలో తయారయ్యే హార్మోన్ల నియంత్రణలో ఉంటుందన్న మాట.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
ప్రశ్న: స్థూలకాయం అనేది శరీర అందానికి సంబంధించిన సమస్య మాత్రమేనా.

జవాబు: కాదు. నిజానికి స్థూలకాయ సమస్యను ఒక వ్యాధిగా పరిగణించాలి. స్థూలకాయ సమస్య 65 రకాల వ్యాధులకు దారితీస్తుంది. మధుమేహం, రక్తపోటు, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం, గుండెజబ్బులు, కీళ్లనొప్పులు, నిద్రలో ఊపిరి సరిగా అందకుండా చేసి గురకకు దారితీసే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా మొదలైన సమస్యలకు స్థూలకాయం మూలకారణం. స్థూలకాయం కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా దారి తీస్తుంది. ఇలా అనేక వైద్యపరమైన సమస్యలకు స్థూలకాయం మొదటిమెట్టు.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్థూలకాయుల సంఖ్య పెరుగుతోంది. ఆధునిక జీవనశైలిలో భాగంగా అధిక క్యాలరీలను ఇచ్చే ఆహారాన్ని తీసుకోవడం, శారీరక శ్రమ తగ్గడంతో ఈ పరిణామం చోటుచేసుకుంటోంది. నూటికి తొంభైమందిలో స్థూలకాయ సమస్య ఈ కారణాలవల్లనే వస్తోంది. మిగిలిన పదిమందిలో ఎండోక్రైన్ సమస్యలు, జన్యుపరమైన అంశాలు, మందుల దుష్ర్పభావం వంటివి ఈ సమస్యకు దారితీస్తున్నాయి. శరీరంలో కొవ్వు పురుషులలో 25 శాతం కంటే ఎక్కువగానూ, మహిళల్లో 35 శాతం కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయం ఉన్నట్లుగా పరిగణిస్తాం. స్థూలకాయం, దాని పరిష్కార మార్గాలపై ప్రజల్లో ఎన్నో అపోహలున్నాయి.

ప్రశ్న : స్థూలకాయాన్ని నిర్ధారణ చేయడానికి విదేశీయులకూ, భారతీయులకూ ఉపయోగించే ప్రమాణాలు ఒక్కటేనా...? 
జవాబు: సాధారణంగా విదేశాలలో జరిగే అధ్యయనాల ప్రకారం వచ్చిన విలువలనే మన దేశవాసులకూ అన్వయిస్తుంటారు. కానీ స్థూలకాయం విషయంలో ఈ ప్రమాణాలు విదేశీ యులకూ, భారతీయులకూ ఒకటి కాదు. స్థూలకాయాన్ని నిర్ధారణ చేయడానికి సాధారణంగా బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) అనే ప్రమాణాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక వ్యక్తి శరీర బరువును కిలోగ్రాములలో తీసుకొని, దానిని ఆ వ్యక్తి ఎత్తు (మీటర్లు) స్క్వేర్తో భాగిస్తే వచ్చే విలువే బీఎమ్ఐ.

ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు 120 కిలోగ్రాములు, ఎత్తు 1.83 మీటర్లు (ఆరడుగులు) అనుకుందాం. 
ఆ వ్యక్తి బీఎమ్ఐ (120 / 1.83) / 1.83

అంటే                    120 / 1.83 = 65.57    
                           65.57 /  1.83 = 35.8

120 కిలోగ్రాములు, ఎత్తు 1.83 మీటర్లు ఎత్తు ఉండే మనిషి బీఎమ్ఐ  35.8

ఇలా లెక్కించిన విలువను ఈ కింది బీఎమ్ఐ పట్టికతో పోల్చి చూసుకుంటే మీ స్థూలకాయ స్థాయి ఏమిటో తెలుస్తుంది. 

స్థూలంగా... సూక్ష్మంగా...

ఏ స్థాయి స్థూలకాయం భారతీయుల బీఎమ్ఐ      పాశ్చాత్యుల బీఎమ్ఐ 
సాధారణ బరువు         18.50 - 22.99 కేజీ/మీ     21.850 - 24.99 కేజీ/మీ2
అధిక బరువు               23.00 - 24.99 కేజీ/మీ2  25.00 - 29.99 కేజీ/మీ2
స్వల్ప స్థూలకాయం     25.00 - 29.99 కేజీ/మీ    23.00 - 34.99 కేజీ/మీ2
అధిక స్థూలకాయం 30+ 35.00 - 39.99 కేజీ/మీ2
వ్యాధిగ్రస్త స్థూలకాయం 40.00 -49.99 కేజీ/మీ2
సూపర్ స్థూలకాయం    50.00 - 59.99 కేజీ/మీ2
సూపర్ సూపర్ స్థూలకాయం 60.00 - ఆపైన

బీఎమ్ఐ ఆధారంగా నిర్ధారణ చేసే స్థూలకాయ వర్గాలు విదేశీయులతో పోల్చి చూస్తే, భారతీయులలో కాస్త తక్కువ గానే ఉంటాయి. ఎందుకంటే విదేశీయులతో పోల్చి చూస్తే మనకు శరీరంలో కొవ్వుశాతం ఎక్కువ, కండరాల పరిమాణం తక్కువ. అందువల్ల మనకు తక్కువ స్థూలకాయం ఉన్నప్పటికీ వైద్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.

భారతీయుల్లో స్థూలకాయాన్ని నిర్ధారణ చేయడానికి బాడీ మాస్ ఇండెక్స్తో పాటు నడుము చుట్టుకొలత, నడుమూ-హిప్ చుట్టుకొలతల నిష్పత్తి మొదలైన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటారు. నడుం చుట్టుకొలత మహిళ ల్లో 80 సెం.మీ. కంటే ఎక్కువగా, పురుషుల్లో 90 సెం.మీ.కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయ సమస్య ఉన్నట్లు. ఇక నడుమూ-హిప్ చుట్టుకొలతల నిష్పత్తి మహిళల్లో 0.8 కంటే ఎక్కువగానూ, పురుషుల్లో 0.9 కంటే ఎక్కువగానూ ఉంటే స్థూలకాయ సమస్య ఉన్నట్లుగా పరిగణించాలి.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
వూబకాయం.. చిన్నారుల నుంచి పెద్దల దాకా ఎదుర్కొంటున్న సమస్య. నిజానికిదో వ్యాధి కాదు. అనేక ఆరోగ్య సమస్యలకు పునాది. ముఖ్యంగా మహిళలు టీనేజీ, సంతాన వృద్ధి దశ, నడి వయసు ఇలా అన్ని దశల్లోనూ స్థూలకాయంతో సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. 

మనదేశంలో స్థూలకాయం సమస్య రెండేళ్ల వయసు నుంచే మొదలవుతునట్లు వైద్యులు చెబుతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారంలో పెరుగుతున్న కెలరీలు, తగ్గుతున్న శారీరక శ్రమ ఇందుకు కారణం. చిన్నప్పుడు పిల్లలు బొద్దుగా ఉన్నా బడికి వెళ్లి ఆటపాటలు నేర్చుకుంటే సన్నగా మారతారనే నమ్మకం మనలో నిన్న మొన్నటి దాకా ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. చిన్నప్పుడు లావుగా ఉండేవాళ్లు టీనేజీ కొచ్చినా ఆ బరువు తక్కించుకో లేకపోతున్నారు. ఇందువల్ల ఆరోగ్యపరంగానే కాదు సామాజికంగా మానసికంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే కౌమారం నుంచే స్థూలకాయం రాకుండా కాపాడుకోవాలి. 

టీనేజీలో వూబకాయం భవిష్యత్తులో ప్రపంచం ఎదుర్కొనే కీలక సవాళ్లలో ఒకటని పరిశోధకులు చెబుతున్నారు. ఆటపాటలకు దూరంగా పెరగడం, రోజులో అత్యధికంగా కెలరీలున్న ఆహారం తీసుకోవడం ఇందుకు కారణం. నేటి తరం పిల్లలు చేతుల నిండుగా పాకెట్ మనీ ఉంటోంది. దాంతో తరచూ పార్టీలు చేసుకుంటూ ఉంటారు. పిజాలూ, బర్గర్ లూ లాగించేస్తుంటారు. అది మరింతగా వూబకాయానికి దారితీస్తోంది. వూబకాయం ఉన్న అమ్మాయిల్లో పీసీఓడీ, రుతుక్రమం సక్రమంగా కాకపోవడం, అవాంఛిత రోమాలు, హార్మోనల్ సమస్యల్లాంటివి ఎక్కువగా వస్తున్నాయి. అంతేకాదు పెద్దయ్యాక వీరిలో దాదాపు 70 శాతం మందికి కొలస్ట్రాల్, బీపీ, నిద్ర లేమి వంటివీ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఓ అధ్యయనం ప్రకారం చిన్నప్పుడే స్థూలకాయంతో బాధ పడే వారు భవిష్యత్తులో ప్రాణాంతక గుండెజబ్బుల బారిన పడే ప్రమాదం 130 శాతం ఎక్కువ!

సాధారణంగా థైరాయిడ్, హార్మోన్ల సమస్యలు, జన్యుపరమైన కారణాల వల్ల కూడా టీనేజ్ అమ్మాయిల్లో వూబకాయం వస్తుంది. ఈ సమస్యలకు సంబంధించి ఇతరత్రా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మంచిది. ఈ సమస్యలు పోగా, ఆహారపు అలవాట్లే ప్రధానంగా వారిలో వూబకాయాన్ని పెంచుతున్నాయని పరిశోధనలో నిరూపించారు. సుమారు మూడు దశాబ్దల కాలంలో టీనేజ్ పిల్లల ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల్ని పరిశీలించారు. రోజు వారి ఆహారంలో తీసుకునే కెలరీలు గణనీయంగా పెరగడం ప్రధాన కారణమని చెప్పారు. చదువులో పడి ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం, క్రీడలకు దూరంగా ఉండడం కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి. 

నివారణ మార్గాలు...

టీనేజ్ లో బయటకు వెళ్లి తినడం సరదాగా అనిపిస్తుంది. కానీ వాటి వల్ల మన శరీరం ఎలా మారుతోందో ఓసారి చూసుకోవాలి! వూబకాయం తగ్గి నాజూగ్గా తయారైతే మనం ఎంత ఆత్మవిశ్వాసంగా, చురుగ్గా ఉంటామో అంచనా వేసుకోవాలి. ఆ లక్ష్యమే మనకు ప్రేరణ కావాలి. సమతులహారం ఎంత అవసరమో.. ఆ ఆహారాన్ని రోజూ నిర్ణీత వేళల్లో తినడం అంతే ముఖ్యం. నిదానంగా అరిగే పిండి పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. చెక్కర వాడకానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఐస్ క్రీమ్ లు, చాకెట్లు, వేపుళ్లూ, ఫ్రైలు వంటివి పూర్తిగా మానేయలేం కాబట్టి బాగా తగ్గిస్తే మంచిది. ఆహారంలో పండ్లూ కూరగాయలు ఎక్కువగా ఉండేల చూసుకోవాలి. రోజులో టీవీ, కంప్యూటర్ రెండింటికీ కలిపి గంట కేటయిస్తే చాలు. చదువు కోసం ఎక్కువ సమయం కేటయించాల్సి వచ్చినప్పుడు కచ్చితంగా ముప్పావు గంటకోసారి అయిదు నిమిషాలపాటు నడవాలి. పెరిగిన బరువు తగ్గించుకోవాలని అనుకున్నప్పుడు గంట గంటన్నర వ్యాయామం తప్పనిసరి. 

గర్భిణిలో వూబకాయం.. 

గర్భం దాల్చలని నిర్ణయించుకున్నప్పుడు వూబకాయంతో ఉన్నవారు బరువు తగ్గితీరాల్సిందే. బీఎంఐ 30 శాతం కంటే ఎక్కువున్న వారిలో గర్భస్రావం కావడం, సిజేరియస్ చేయాల్సి రావడం, హైపర్ టెన్షస్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రసానంతరం బిడ్డలకు పాలుపట్టడం, కొనసాగించడం కూడా కష్టమవుతుంది.

వూబకాయం ఉన్నవాళ్లు గర్భం దాల్చడానికి ముందు ఓ అయిదు కిలోలైనా తగ్గాలి. అలా చేయడం వల్ల గర్భం దాల్చక ఏర్పడే అధిక రక్తపోటూ, మధుమేహం సమస్యల్ని 40 శాతం తగ్గించుకోవచ్చు. గర్భిణులు ఉన్న బరువు తగ్గాల్సిన అవసరం లేదు. బరువు పెరగకుండా కాపాడుకుంటే చాలు! ప్రసవం తర్వాత సాధారణంగా రెండు, మూడు కిలోలే బరువు తగ్గుతారు. కాబట్టి అప్పుడూ కేలరీలు తక్కువగా తీసుకోవాలి. సమతుల ఆహారమే ఎంచుకోవాలి. ప్రొటన్లు, క్యాల్షియం, ఇనుము ఎక్కువగా ఉన్నవి తీసుకోవాలి. 

తీసుకోవలసిన ఆహారం..

గుడ్డూ, చికెస్, పనీర్, సోయా, డబుల్ టోన్డ్ మిల్క్ అరలీటరు నుంచి 750 ఎంఎల్ వరకూ వాడవచ్చు. రోజులో ఆకుకూర, అరకేజీ కూరగాయలు, రెండు రకాల పండ్లూ, విటమిన్ సి ఉండే నిమ్మలంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఒక్కో పూట ఒక్కో రకం తృణధాన్యాలు, మేలైన కొవ్వు ఉండే ధాన్యాలు ఎంచుకోవాలి. బేకరీ పదార్థాలు, పాలిష్ చేసిన బియ్యం వాడకం తగ్గించాలి. చిప్స్ వంటి శాచురేటడ్ కొవ్వులూ, కారప్పూస, ఎక్కువకాలం నిల్వ ఉంచిన పచ్చళ్లూ వంటివి అసలొద్దు. 

నాజూకుతనంపై మధ్యవయస్కుల్లోనూ శ్రద్ధ పెరుగుతోంది. వూబకాయం తగ్గించుకోవాలనుకున్నప్పుడు తక్కువ కాలనికి ఎక్కువ లక్ష్యం పెట్టుకుని, అది సాధ్యంకాక నిరాశా నిస్పృహలతో ఆపేస్తుంటారు చాల మంది. కొందరైతే ఈ లక్ష్యాలకు భయపడి ప్రయత్నాలనీ వాయిదా వేస్తుంటారు. ఇది వారిలో ఒత్తిడి పెంచుతుంది. అలాకాకుండా క్రమంగా ఓ పద్ధతిలో బరువు తగ్గాలి. నిపుణుల సలహా తీసుకోవాలి.
బరువు తగ్గడానికి మీరు రోజూ చేసే ప్రయత్నమేదీ వృథా కాదు. కనీసం రెండు నెలలు మీరు వ్యాయామాలు చేసినా, రక్తంలోని చెడు కొవ్వు(ఎల్డీఎల్) తగ్గి.. మంచి కొవ్వు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆకలి తీవ్రతను తగ్గించేల మన ఆహార విధానం ఏర్పరచుకోవాలి. అయితే అర్ధాకలితో ఉండడం మంచిది కాదు. పచ్చిగా, మసాల లేకుండా పచ్చి కూరగాయలు తినడం అలవాటు చేసుకోవాలి. ఉడికించిన కూరలు తినడానికే పరిమితం కండి. పోషకాలను మన రోజు వారి అలవాట్లను బట్టి ఏయే పోషకాలు అవసరం, ఏవి కాదూ అని నిర్ణయించుకోవాలి. శారీరకంగా తక్కువగా శ్రమించే వాళ్లు ఎక్కువ ఐరన్, కొవ్వు పదార్థాలను తీసుకోవడం మంచిది కాదు. 

కేలరీలు తక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమతో ఎక్కువగా ఖర్చు పెట్టడం. బరువు తగ్గడానికి ఇదే ప్రధాన సూత్రం! 
ఒక పౌండు (సుమారు రెండు కిలోలు) బరువు తగ్గాలంటే రోజులో 3500 కేలరీలు ఖర్చుపెట్టాలి. 

వూబకాయం ఉన్నవాళ్లు అయిదు శాతం బరువు తగ్గించారనుకుందాం. అయిదేళ్లు పాటు అది పెరగకుండా చూసుకుంటే.. గుండెజబ్బు, మధుమేహం వంటి సమస్యలు 75 శాతం వరకూ రావు. 

కొందరికి పొట్ట దగ్గర, నడుం చుట్టు కొవ్వు చేరుతుంది. దానిపైనే దృష్టి పెట్టి బరువు తగ్గించుకోవాలనుకుంటారు. నిజానికి, బరువేప్పుడు శరీరం మొత్తంగా ఓ క్రమంలోనే తగ్గుతూ వస్తుంది. బరువు తగ్గాలనుకున్నప్పుడు కొందరు ఆహారం తగ్గిస్తే సరిపోతుందని అనుకుంటారు. అలా చేస్తే.. కండరాల రాశి తగ్గి కొవ్వు పెరుగుతుంది. ఆహార నియమాలు పాటించడంతోపాటు రోజులో వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలి.