Articles by "dental"
dental లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
దంతాలు ఆరోగ్యంగా ఉంటే, సాధారణ ఆరోగ్యం బాగుంటుంది. అనేక కారణాల వలన దంతాలు ఇన్ఫెక్షన్లకు లోనై దంత క్షయం సంభవిస్తుంటుంది. దంతాలు ఇన్ఫెక్షన్లకు లోనై నప్పుడల్లా ఆ భాగంలో విపరీతమైన నొప్పి కలుగుతుంది.  ఈ నొప్పి దంతాలలో కాని, అవి ఉన్న భాగంలోని దవడ ఎముకలలో కాని ఉండవచ్చు.  నొప్పి విడవకుండా ఉండవచ్చు. లేదా పొడుస్తున్నట్లు కాని, దేని తోనో కొడుతున్నట్లు కాని అనిపించవచ్చు.  ఈ విధమైన దంత శూల కలగడానికి వివిధ కారణాలున్నాయి. వీటిలో ముఖ్యమైనది దంతక్షయం.  దంత మూలాలలో ఇన్ఫెక్షన్లు కలగడం వలన దంతక్షయం ఏర్పడి నొప్పి కలుగవచ్చు.  దంతాలపైన ఉండే ఎనామిల్ నాశనమై, దంతాలలోని సున్నిత భాగం పైకి వచ్చి మనం తీసుకునే ఆహారం, చల్లటి నీరు మొదలైన వాటి తాకిడి కారణంగా నొప్పి కలుగవచ్చు. అలాగే ఏవేని ప్రమాదాల కారణంగా దంతాలు విరగడం కూడా దంతశూలకు కారణం కావచ్చు.
ప్రథమ చికిత్స
  • దంత క్షయానికి గురవుతున్న దంతం చుట్టూ లవంగ నూనెను రాయడం ద్వారా ఉపశమనాన్ని పొందవచ్చు. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు రబ్బరు సంచిలో వేడినీటిని పోసి (హాట్వాటర్ బ్యాగ్) దానిని నొప్పి ఉన్న వైపు బుగ్గలపై పెట్టుకోవడం ద్వారా బాధనుంచి నివారణ పొందవచ్చు.
  •  దంతశూలను తగ్గించుకోవడానికి అనేక విధానాలున్నాయి. ఆహార పదార్థాలు, పండ్లు, ఐస్ క్రీమ్ మొదలైనవి తీసుకున్నప్పుడు పంటి నొప్పి ఉంటే ఆ భాగంపై టూత్ పేస్టును పూయడం ద్వారా నొప్పి కలుగకుండా చేసుకోవచ్చు.
  • నొప్పి నివారణ కోసం మాత్రలను వేసుకో వచ్చు. అయితే ఏ ఔషధం వాడాల్సి వచ్చినా వైద్య సలహా తీసుకోవడం తప్పనిసరి. నొప్పి ఇంకా తగ్గకుండా బాధిస్తూనే ఉంటే, వెంటనే దంత వైద్యులను సంప్రదించాలి. అవసరాన్ని బట్టి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి రావచ్చు.



E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
డయాబెటిస్ అన్ని అవయవాలను ప్రభావితం చేసినట్లే... పళ్లనూ చేస్తుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు గుండె, రక్తపోటు విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లే... పళ్ల విషయంలోనూ అంతే శ్రద్ధగా ఉండాలి. ఎందుకంటే డయాబెటిస్ ఉన్నవారికి రోగనిరోధకశక్తి తక్కువ . దాంతో నోటిలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. పైగా చిగుళ్ల వ్యాధిలో నొప్పి తెలియదు. దీనికి తోడు డయాబెటిస్ ఉందంటే చిగుళ్ల వ్యాధులు వచ్చేందుకు అన్ని రకాల అవకాశాలుంటాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు నోరు, దంతాల విషయంలో ఎలాంటి జాగ్ర త్తలు పాటించాలన్న అవగాహన కోసం ఈ కథనం.

డయాబెటిస్ ఉన్నవారు డెంటిస్ట్ వద్దకు వెళ్లినప్పుడు తమకు డయాబెటిస్ ఉందన్న సంగతి తప్పనిసరిగా చెప్పాలి. డయాబెటిస్ కు వాడుతున్న మందులు, వ్యాధి నియంత్రణలో ఉన్నదా అన్న విషయం డెంటిస్ట్కు వివరించాలి. డయాబెటిస్ మందులతో పాటు వారు వాడే ఇతర మందులు అంటే రక్తాన్ని పలుచబార్చే మందుల వంటి వాటి వివరాలతో పాటు రోగి తాలూకు పూర్తి మెడికల్ హిస్టరీ ని వివరించాలి.

డయాబెటిస్ రోగుల్లో వచ్చే సాధారణ నోటి సమస్యలు...
  • తరచూ నోరు తడారిపోవడం: సాధారణంగా నోరు ఎప్పుడూ తడిగా ఉంటుంది. కానీ డయాబెటిస్ ఉన్నవారిలో మాత్రం నోరు పొడిబారిపోతూ ఉండటం చాలా సాధారణం. ఈ పరిస్థితిని ‘జీరోస్టోమియా’ అంటారు. ఇలా నోటిలో తగినంత లాలాజలం లేనప్పుడు బ్యాక్టీరియా అంతా ఒకచోట గూడుకట్టినట్లుగా పెరుగుతుంది. దీన్ని కాలొనైజేషన్ అంటారు. ఇలా జరగడం వల్లనే చాలామంది షుగర్ రోగుల్లో నోటి దుర్వాసన చాలా సాధారణం. ఇలా నోరు పొడి బారడం అన్నది దీర్ఘకాలం పాటు కొనసా గితే అది నోటిలోని మృదుకణజాలం (సాఫ్ట్ టిష్యూస్) దెబ్బతినేలా చేస్తుంది. దాంతో పాటు దంతక్షయం, పంటినొప్పి వంటి సమస్యలు వస్తాయి. జీరోస్టోమియా అనే సమస్య కాస్త వయసు పైనబడినవారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో మరికాస్త ఎక్కువ. మనం తిన్న ఆహార పదార్థాలను గొంతులోకి సులువుగా జారుతూ వెళ్లేలా చేయడానికి లాలాజలం అవసరం. నోటిలో తగినంత లాలాజలం లేకపోతే పళ్లు పుచ్చిపోవచ్చు, చిగుళ్ల వ్యాధులతో పాటు మాట్లాడటంలో ఇబ్బంది, మింగలేకపోవడం, గొంతు బొంగురుపోవడం, నోటిలో మంట, ముక్కు పొడిబారడం వంటి సమస్యలు కూడా రావచ్చు. దీర్ఘకాలంపాటు నోరు పొడిబారిపోయినట్లుగా ఉండే చక్కెర రోగులు తప్పనిసరిగా దంతవైద్యులను కలవాలి. వారు నోరు పొడిబారకుండా ఉండేందుకు కొన్ని చికిత్సలు చేస్తారు. వాటితో పాటు కొన్ని పుక్కిలించే ద్రవాలు, ఫ్లోరైడ్ ఉండే పూతమందులను సైతం సూచిస్తారు. చక్కెర లేని గమ్స్, చక్కెర రహిత మింట్ వంటి వాటిని నములుతూ ఉండటం వల్ల నోటిలో తగినంత లాలాజలం ఊరుతుంటుంది. ఇక కొద్ది కొద్ది సేపటికి ఒకసారి చిన్న చిన్న గుటక వేస్తూ మంచినీళ్లు తాగడం కూడా మేలు చేస్తుంది. ఫ్రిజ్లోని ఐస్ ముక్కల ను తీసుకుని చప్పరించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇక నోరు పూర్తిగా పొడిబారి పోయేవారు కాఫీ, కూల్ డ్రింక్స్ వంటి  కెఫిన్ ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ కాఫీ తాగే అలవాటు ఉంటే, చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి.
  • నోటికి రుచి తెలియకపోవడం: ఇంతకు ముందులా ఇప్పుడు తమ నోటికి రుచి తెలియడం లేదంటూ చాలామంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఫిర్యాదు చేస్తుంటారు. అందుకే వారు ఆహార పదార్థాలను మరింత రుచికరం చేసుకోవడం కోసం రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకుంటుంటారు. దాంతో వారి పరిస్థితి మరింత తీవ్రమవుతుంది.  పైగా ఈ తరహా ఆహారం వల్ల నోటిలో మరింతగా బ్యాక్టీరియా చేరుతుంది. అది చేరుతున్న కొద్దీ దంతక్షయం, పంటినొప్పి వంటి సమస్యలూ పెరుగుతాయి. అందుకే రుచి తెలిసినా, తెలియకపోయినా ఆహారం విషయంలో డయాబెటిస్ రోగులు తమ పరిమితులను పూర్తిగా పాటించాలి. కార్బోహైడ్రేట్ ఆహారాన్ని, కొవ్వుపదార్థాలను పరిమితంగా తీసుకుంటూ, పుష్టికరమైన ప్రోటీన్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.
  • ఓరల్ క్యాండిడియాసిస్: ఇది నోటిలో వచ్చే ఒకరకం ఫంగల్ ఇన్ఫెక్షన్. నోటిలో డెంచర్స్ వాడేవాళ్లతో పాటు డయాబెటిస్ రోగుల్లోనూ ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ వ్యాధి వచ్చినవారు దంతవైద్యుల సలహా తో యాంటీ ఫంగల్ మందులను వాడాల్సి ఉంటుంది. ఈ వ్యాధి ఉన్నవారు నోటి పరిశుభ్రతను పాటించడం అవసరం.
 అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్నవారు సైతం ప్రతి ఆర్నెల్లకు ఒకసారి డెంటిస్ట్ను కలిసి క్లీనింగ్ వంటి సాధారణ ప్రక్రియలు చేయించుకోవాలన్నది దంతవైద్యులు చేసే సిఫార్సు. అలాంటిది ఒకవేళ డయాబెటిస్ కూడా ఉంటే వారు తరచూ దంతవైద్యనిపు ణులను కలిసి తమ పళ్లు పరీక్షింపజేసుకోవ డం చాలా అవసరం.

చక్కెరతో దంతాలపై ప్రభావం ఇలా...
మనం ఆహారం తీసుకున్నప్పుడు నోట్లో మిగిలి పోయిన ముక్కల నుంచి బ్యాక్టీరియా పెరిగి అది దంతాలపై పాచి (ప్లాక్)లా ఏర్పడుతుంది. మన ఆహారంలో తీపి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ గా ఉంటే ఈ బ్యాక్టీరియా పెరుగుదల మరీ ఎక్కువ. వాటి నుంచి యాసిడ్స్ తయారై, అవి పంటిపై దుష్ర్పభావం చూపడం వల్ల పంటి ఎనా
మిల్ దెబ్బతింటుంది. ఇది అదేపనిగా జరగడం వల్ల పంటి ఎనామిల్లో పగుళ్లు వచ్చి అవే పంటిలో ని క్యావిటీస్గా ఏర్పడతాయి. చక్కెర వ్యాధి అదుపులో లేనివారిలో బ్యాక్టీరియా మరింతగా పెరిగేందుకు దోహదం చేస్తుంది. దాంతో పాచి కాస్తా ‘గార’ (టార్టార్)గా మారి చిగుళ్ల వద్ద, పంటికీ పంటికీ మధ్య దీర్ఘకాలికంగా ఉండిపోతుంది. అది అలా ఉండిపోవడం వల్ల క్రానిక్ (దీర్ఘ కాలిక) ఇన్ఫెక్షన్స్కు, ఇన్ఫ్లమేషన్కు దారితీయవచ్చు.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
నా వయసు 55 సంవత్సరాలు. బీపీ, షుగర్ ఉన్నాయి. పళ్లు బాగా అరిగిపోయాయి. ఈ మధ్యనే కొన్ని పళ్లు పీకించాను. మిగిలిన పళ్లతో అంత బాగా నమిలి తినలేకపోతున్నాను. డాక్టర్ను కలిస్తే అన్ని పళ్లూ పీకేసి, కొత్తవి కడదాం అన్నారు. భయమేసి మళ్లీ డాక్టర్ దగ్గరికి వెళ్లలేదు. నేను అన్ని పళ్లూ పీకించాలంటారా? సలహా ఇవ్వండి.

ఎవరికైనా యాభై సంవత్సరాలు దాటిన తర్వాత శరీరంతో పాటు నోటిలో కూడా కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. పళ్లను... నమలడానికి దశాబ్దాల తరబడి వాడుతుంటాం. కాబట్టి అరిగిపోవడం సాధారణమే. కొంతమందికి ఎక్కువగా, మరికొంత మందికి తక్కువగా అరుగుతుంటాయి. ఇక బీపీ, షుగర్ లాంటి దీర్ఘ కాలిక సమస్యలు తోడైనప్పుడు నోటి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావమే ఉంటుంది. నోట్లో లాలాజలాన్ని ఉత్పత్తి చేసే గ్రంథులు కూడా సరిగా పనిచేయక సహజసిద్ధమైన దంత పరిరక్షక వ్యవస్థ దెబ్బతింటుంది. అందువల్ల పళ్లు పుచ్చిపోవటం, చిగుళ్లకు సంబంధించిన జబ్బులు వంటివన్నీ పళ్లు పూర్తిగా దెబ్బతినడానికి కారణమవుతాయి. 
షుగర్ పేషెంట్లలో అసిటోన్ స్మెల్ అనే నోటి దుర్వాసన కూడా ఉంటుంది. అందుకే యాభై సంవత్సరాల లోపు కంటే ఆపై వయసున్న వారే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్గా దంతవైద్యుడిని కలిసి తగిన సలహాలు, సూచనలు పొందాలి. ఎప్పటికప్పుడు చికిత్స చేయించుకుంటుండాలి. అరిగిన లేదా విరిగిన పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, తొడుగులు వేయడం ద్వారా బాగా నమిలి తినే శక్తిని తిరిగి తీసుకురావచ్చు. చిగుళ్ల జబ్బులు నయం చేసే క్యూరటాస్, ఫ్లాప్ ట్రీట్మెంట్, ప్రత్యేక లేజర్ చికిత్సల ద్వారా చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
పళ్లు ఊడినా లేదా తీసేసినా, వెంటనే కృత్రిమ దంతాలను అమర్చుకోవడం తప్పనిసరి. ఒకటిరెండు పళ్లు పోతే ఏమైందిలే, మిగిలిన పళ్లతో మేనేజ్ చేస్తున్నాం కదా అనుకుంటారు. కానీ, ఏదైనా ఒక దవడలో ఒక పన్ను లేకుంటే 25 శాతం నమిలే శక్తిని కోల్పోతారని ఒక అంచనా. ఎంత మంచి ఆహారం తీసుకుంటున్నామన్నది ముఖ్యం కాదు. వాటిని ఎంత బాగా నమిలి, జీర్ణం చేసుకోగలుగుతున్నాం, ఎంత ఒంట బట్టించుకో గలుగుతున్నాం అనేది కీలకం. అందుకే నమిలే శక్తి బాగా ఉన్నంతకాలం ఎవరూ ముసలి తనాన్ని ఫీలవరు. నోటి ఆరోగ్యాన్ని పదిలంగా చూసుకోగలిగినంతకాలం వృద్ధాప్యం రాదు. వీరిపట్ల ప్రతి ఒక్కరూ కాస్తంత అవగాహన కలిగి ఉండాలి. స్పెషలిస్టును కలిసి, చికిత్స చేయించుకోండి.