పశ్చిమగోదావరి జిల్లా నరసారపురంలో 1933 డిసెంబరు 15న జన్మించిన బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. తల్లిదండ్రులు వేణుగోపాలరావు, సూర్యకా...
పశ్చిమగోదావరి జిల్లా నరసారపురంలో 1933 డిసెంబరు 15న జన్మించిన బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. తల్లిదండ్రులు వేణుగోపాలరావు, సూర్యకాంతం.
![]() |
Bapu Directing a Movie |
అసలు పేరు ‘తలిదండ్రుల’వరకే పరిమితమై సిసలు పేరు మాత్రం ప్రపంచం ఎల్లలు దాటింది. న్యాయవాద పట్టాతో మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నా, బొమ్మలు వేయడంతో జీవితాన్ని ప్రారంభించారు. వడ్డాది పాపయ్య ముఖచిత్రంతో వచ్చిన ‘యువ’ మాసపత్రిక ఆ తరం వాళ్లకు గుర్తుండే ఉంటుంది. విజయవాడ నుంచి ప్రచురితమమై ‘జ్యోతి’లో ముళ్లపూడి వెంకటరమణ, బాపు మరో యుగాన్ని ప్రారంభించారు. బాపు వేసిన రేఖా చిత్రాలు, కార్టూన్లు కడుపుబ్బ నవ్వించేయి. అవి చూసి కొందరు ముసి ముసిగా నవ్వుకుంటే. కొందరు పకలపడి నవ్వేకునేవారు. మరికొన్ని చిత్రాలు కళ్లు చెమర్చేలా చేసేయి. మన చిన్నప్పుడే ఆయన అందించిన ‘బుడుగు’, ‘సీగాన పసూనాంబ’, జగన్నాథాష్టకంలోని అద్భుత బొమ్మలు ఆయన్ను మనకు చాల దగ్గర చేసాయి.
![]() | |||||
Bapu Bomma Charmi |
పదహారణాల తెలుగమ్మాయి ఎలా ఉంటుందీ అన్నది మనకు బాపు, తన గీతల్లో చూపారు. పారెడు జడా, గింగరాలతో గాలికి చెదిరిన ముంగురులూ, కోల మొహమూ, సున్నాలా అందంగా బుడిబుడి కోపంతో విసుక్కునే చిన్న ఎరట్రి పెదాలూ, వయ్యరాలు పోతున్న సన్నటి శరీరమూ, లెక్కేసి అంటించినట్టు అందాల వంపులూ, మొత్తం మీద చిదిమి దీపం పెట్టే తెలుగమ్మాయి ఆ రోజుల్లో అంటే దాదాపు అయిదు దశాబ్ధల కిందటే ‘దుమారం’ లేపింది. ఇక పుస్తకాల్లో కథలకు ఆయన వేసిన బొమ్మలు చదివించేది. ముఖచిత్రాలు పుస్తకంలోని పేజీలను చకచకా తిప్పేలా చేసేవని చాలామంది రచయితలు ఒప్పుకొని తీరతారు.
![]() |
Bapu Sri Krishna Painting |
తను పనిచేసిన ప్రతిరంగంలోనూ బాపు ప్రయోగాలు చేశారు. తనదైన ముద్రను ‘రాజముద్ర’అనుకునేలా చేశారు. కొన్నాళ్లు ‘పబ్లిసిటీ’లో వెలిగారు. 1967లో సినిమా రంగంలో ‘సాక్షి’తో అవతరించారు. తెలుగు ప్రేక్షకులను ముత్యాలముగ్గు తో తలెత్తుకునేలా చేశారు. విలన్ అంటే గళ్ల లుంగీ, నోట్లో సిగరెట్, భీకరంగా అరవడమనే మూస దోరణిని బాపు పటాపంచలు చేశారు. సెగ్రెట్రీ.. ఆకాశంలో చూడు మర్డరు జరిగినట్టు లేదూ.. అన్న డైలాగు ఎంత పాపులరైందో అందరికీ తెలుసు. హలం చెమట తో తడిసిపోవడం, అల్లు రామలింగయ్య ‘వానర’ మహిమ చూపడం, ‘మాడా ’ కాలు కెంత? చేతి కెంత? రెండూ కలిపితే ఎంత? వోల్ మొత్తం మీద కన్సెషనేమన్నా ఉందా? లాంటి మాటలు తెలుగు ఇళ్ళలోకి తేలిగ్గా దూరాయి. ఆనందపరవశులను చేశాయి. రమణ-బాపు మార్కు సినిమాలు తెలుగు అందాలను ప్రపంచం నిండా ప్రభవించాయి. సాక్షి, బంగారు పిచ్చిక, బుద్ధిమంతుడు, అందాలరాముడు, బాలరాజుకథ, సంపూర్ణ రామాయణం, శ్రీరామాంజనేయ యుద్ధం, ముత్యాల ముగ్గు, సీతా కళ్యాణం, మనవూరి పాండవులు, గోరంతదీపం, తూర్పువెళ్లే రైలు, రాధ కల్యాణం, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం, రాంబంటు, నిన్నటి శ్రీరామరాజ్యం ఇలా ఎన్నో సినిమాలు ముళ్లపూడి కథ, బాపు దర్శకత్వంలో ప్రేక్షకులను సకుటుంబంగా అలరించాయి.
![]() |
Bapu Sri Venakteshwara Painting |
![]() |
Bapu Lord Siva and Parvathi Painting |
బాపుకి బొమ్మలు వేయడంలో గాని, సినిమాలకు సంబంధించి ఏ గురువూ లేరు. ఆయన సొంతంగానే ప్రతి రంగంలో తనదైన ముద్ర వేసారు. ఒక్క గీతలో వంద భావాలను తెలిపే బాపు బొమ్మాల్లో, మానవత ఇంకా కొట్టొచ్చినట్టే కనిపిస్తోంది. దాదాపు 50 వేల బొమ్మలు, నలభైకి పైగా సినిమాలు తీసిన బాపును 1979లోనే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆస్థాన చిత్రకారుడిగా గౌరవించారు. 1982లో రాజాలక్ష్మి అవార్డు, 1987లో రాఘుపతి వెంకయ్య అవార్డు, 1991లో ఆంధ్ర యూనివర్సిటీ కళాప్రపూర్ణ గౌరవం, 50వ జన్మదినం సందర్భంగా అమెరికాలో ‘తానా’ సత్కారం, ఇంక మరెన్నో సన్మానలు, సత్కరాలతో పాటు 2013లో పద్మశ్రీ పురస్కారం బాపును వెతుక్కుంటూ వచ్చాయి.
COMMENTS