ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంపై చింతిస్తూనే ఉంటారు. పనిలో ఒత్తిడీ , ఉద్యోగంలో ఎదుగుదల , వ్యాపారంలో పోటీ , చదువుల్లో ముందంజ , పెరిగిపోయే ఖర్చులూ ...

కొద్ది మోతాదుల్లో ఉండే చింత మామూలే, అది సహజం కూడా. కానీ.. రోజంతా అదేపనిగా చింతాక్రాంతులై ఉంటే మాత్రం సాధారణం కాదు. ఇలాంటి సమస్యను వైద్యులు.. 'జనరలైజ్డ్ యాంగ్త్జెటీ డిజార్డర్-జీఏడీ'గా అభివర్ణిస్తున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు జీవితంలో చాలా చిన్న చిన్న విషయాలకూ ఆందోళన చెందుతూ, ఆ ఆలోచనల్ని నియంత్రించుకోలేక క్షోభ పడుతుంటారు. ఆందోళనకు దారితీసే ఈ ఆలోచనలు.. శారీరకంగా బడలికనూ, మానసికంగా ఆలోచనారహిత స్థితిలోకి నెడతాయి. వీటన్నింటి కారణంగా వీరిలో మానసిక వ్యాకులత ఎక్కువవుతుంది.
మీ మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే.. మీ జ్ఞాపకశక్తి ఏమాత్రం తగ్గకుండా ఉండాలంటే.. చింతలన్నీమాని, సాధ్యమైనంత వరకూ సంతోషంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
చింత, ఆందోళన, కుంగుబాటు (వర్రీ, యాంగ్త్జెటీ, డిప్రెషన్)లు మన విషయగ్రహణ శక్తిని ఎంతోకొంత దెబ్బతీస్తాయి. నిజానికి ఇది జ్ఞాపకశక్తి లోపానికి కారణమయ్యే ఆల్జిమర్స్ వ్యాధి ప్రారంభ దశలో కనిపించే లక్షణం. ఆల్జిమర్స్ ఆరంభమవటంలో తీవ్రమైన మానసిక వ్యథ, కుంగుబాటు కీలకపాత్ర పోషిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. మానసిక వ్యథకూ, విషయగ్రహన శక్తి లోపానికీ మధ్య సంబంధాన్ని నిర్ధారించేందుకు పరిశోధకులు రెండు భారీ అధ్యయనాల్ని పరిశీలించారు. ఎక్కువగా ప్రతికూల భావాలతో నలిగిపోయేవారిలోనే ఇలాంటి సమస్య అధికంగా ఉన్నట్లు తేల్చారు. దీర్ఘకాల మానసిక ఒత్తిడి కూడా ఈ ప్రజ్ఞా లోపానికి దారి తీస్తున్నట్లు వెల్లడైంది.
COMMENTS