మన గుండె నిరంతరం లబ్‌డబ్‌మని కొట్టుకుంటూ ఉంటుంది కదా. ఇది సమర్థవంతంగా పనిచేస్తేనే శరీరంలోని అన్ని భాగాలకు తగినంత రక్తం పంప్ అవుతుంది. సాధార...
మన గుండె నిరంతరం లబ్‌డబ్‌మని కొట్టుకుంటూ ఉంటుంది కదా. ఇది సమర్థవంతంగా పనిచేస్తేనే శరీరంలోని అన్ని భాగాలకు తగినంత రక్తం పంప్ అవుతుంది. సాధారణంగా మన గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఈ వేగం (పల్స్) మన శరీర సామర్థ్యాన్నే కాదు.. గుండె ఆరోగ్యాన్నీ, ఇతర సమస్యలనూ పట్టి చూపుతుంది. అందువల్ల గుండె వేగం గురించి అవగాహన కలిగి ఉండటం అవసరం.

వేగాన్ని పెంచే కారకాలు
- భావోద్వేగాలు: ఒత్తిడి, ఆందోళన, విచారం, సంతోషం వంటి భావోద్వేగాలకు గురైనప్పుడూ గుండెవేగం పెరుగుతుంది.
- శరీర భంగిమ: విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, కూచున్నప్పుడు, నిలబడినప్పుడు గుండె వేగం ఒకేలా ఉంటుంది. అయితే కొన్నిసార్లు నిలబడిన వెంటనే 15-20 సెకండ్ల పాటు ఇది కాస్త పెరగొచ్చు. కానీ కొద్దిసేపట్లోనే వేగం సర్దుకుంటుంది.
- వూబకాయం: భారీ వూబకాయుల్లో విశ్రాంతి సమయంలో గుండెవేగం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది సాధారణంగా 100కు మించకపోవచ్చు.
- ఉష్ణోగ్రత: వాతావరణంలో ఉష్ణోగ్రత, తేమ పెరిగినపుడు గుండె మరింత ఎక్కువగా రక్తాన్ని పంప్ చేయాల్సి వస్తుంది. దీంతో గుండె నిమిషానికి 5-10 సార్లు ఎక్కువగా కొట్టుకుంటుంది.
వేగాన్ని ఎంతవరకు పెంచొచ్చు?
వ్యాయామం చేసినపుడు గుండె సాధ్యమైనంత ఎక్కువగా కొట్టుకునేలా చూసుకోగలిగితే మంచిదని నిపుణులు సూచిస్తుంటారు.
అయితే ఈ గరిష్ఠ గుండెవేగాన్ని గుర్తించటమెలా? దీనికి తేలికైన సూత్రముంది. 220లోంచి వ్యక్తి వయసును తీసేస్తే.. వచ్చే సంఖ్యను గరిష్ఠ గుండెవేగంగా పరిగణించొచ్చు. అంటే 40 ఏళ్ల వ్యక్తి నిమిషానికి గరిష్ఠంగా 180 సార్లు గుండె కొట్టుకునేవరకు వ్యాయామం చేయొచ్చన్నమాట. అయితే ఇది ఆయా వ్యక్తుల సామర్థ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని మరవరాదు. కచ్చితంగా ఎంతమేరకు వ్యాయామం చేయాలనేది డాక్టర్ల సూచనల మేరకు నిర్ణయించుకోవాలి.
COMMENTS