మహిళల్లో నెలసరి బుతుచక్రం శాశ్వతంగా నిలిచిపోవటాన్ని మెనోపాజ్ అని అంటారు . మెనోపాజ్ అనేది ఒక వ్యాధి కాదు . ఒక శారీరక స్థితి ....

మెనోపాజ్ ప్రారంభంలో బుతుచక్రం ఆలస్యం అవుతుంది. మూడు, నాలుగు నెలలకొకసారి బహిష్టు కావడం ఆ సమయంలోనూ బుతుస్రావం కొద్దిగా, ఒకటి లేక రెండు రోజులే ఉండటం జరుగుతుంది. ఆ తర్వాత బుతుస్రావం పూర్తిగా ఆగిపోతుంది. దీని గురించి పెద్దగా ఆందోళన పడవలసిన అవసరం లేదు.
అయితే బుతుచక్రం ఆగిన స్త్రీలలో ఆరోగ్యపరంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నం అవుతాయన్నది వాస్తవం. ప్రత్యేకించి లావు పెరగటం, ఎముకలలో పటుత్వం తగ్గటం, మానసిక చికాకులు తదితర సమస్యలు చాలామంది మహిళలలో సర్వసాధారణం. ఇవన్నీ వ్యాధులు కావని, సహజసిద్ధమైన సమస్యలేనని ముందు అర్థం చేసుకోవాలి. అందువలన కొద్దిపాటి జాగ్రత్తలతో, ఆహార చికిత్సతో ఈ చిన్నపాటి సమస్యలను అధిగమించవచ్చు.
మెనోపాజ్కు, హార్మోన్లకు అవినాభావ సంబంధం ఉన్నదన్న విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్, ఆండ్రోజెన్ అనే హార్మోన్లు బుతుచక్రాన్ని నియంత్రించి క్రమబద్ధీకరిస్తాయి. ఈ హార్మోన్లు ఒక రకంగా ఆరోగ్య రక్షకాలు కూడా. అంటే వ్యాధి నిరోధకాలు (ఆంటీ ఆక్సిడెంట్లు), ఈ హార్మోన్లు, గుండెజబ్బులు రాకుండా, ఎముకలలో దృఢత్వం తగ్గకుండా కాపాడతాయి. కాల్షియం లోపం బయటపడి, ఎముకల దృఢత్వం తగ్గుతుంది.
ముతక ధాన్యాలు, సాట్యురేటెడ్ కాని క్రొవ్వు పదార్థాలు, పండ్లు ఫలాలు, కాయగూరలు,
ఆకుకూరల ద్వారా కాల్షియం, విటమిన్ 'డి' లోపాన్ని అధిగమించవచ్చు. అందువలన ఎముకలు దీర్ఘకాలం దృఢంగా ఉంటాయి.
కాఫీ, టీని అతిగా సేవించటం మానివేయాలి. చాక్లెట్లు, శీతలపానీయాలకు దూరంగా ఉండటం మంచిది. నిజానికి మెనోపాజ్ లక్షణాలు ప్రారంభం అయ్యే దశలోనే ఈ జాగ్రత్తలు తీసుకోవటం ఎంతో మంచిది.
వీటన్నింటినీ మించి మానసిక ప్రశాంతతను, ఆనందాన్ని పెంచుకునే విధంగా జీవనశైలిని మార్చుకోవటం ఎంతో అవసరం.
ఆ క్రమంలో వ్యాయామాలు, ఏదో ఒక వ్యాపకంతో మనసుకు పనిపెట్టటం అవసరం. మెనోపాజ్ అంటే, అంతా అయిపోయింది. వృద్ధాప్యం వచ్చేసింది అనే భావనతో బాధపడకూడదు.
మొత్తం మీద మెనోపాజ్ అనేది ఒక వ్యాధి కాదని, ఒక స్థితి అన్నది అర్థం చేసుకుని, జీవన విధానాన్ని మార్చుకోవటంతోపాటు, మంచి మానవ సంబంధాలను ఏర్పరచుకుంటూ, బలవర్థకమైన, సులభంగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకుంటూ, ప్రత్యేకించి, కాల్షియం, విటమిన్'డి' కొరత రాకుండా చూసుకుంటే, అసలు మెనోపాజ్ ఒక సమస్యే కాదు.
అయితే మెనోపాజ్ దశలోకి ప్రవేశించిన స్త్రీలకు, అప్పటికే మధుమేహం, రక్తపోటు, కాలేయ సంబంధ తదితర వ్యాధులు ఉన్నట్లయితే వైద్యుల సలహా మేరకు ఆహారాన్ని ఎంపిక చేసుకోవటం ఉపయుక్తం.
- మెనోపాజ్ దశలో ప్రవేశించిన స్త్రీలకు, ఆమె జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం అవసరం. మెనోపాజ్ ప్రారంభదశలో వారిలో కలిగే చికాకును అర్థం చేసుకుని సహకరించటం చాలా అవసరం.
- ఎక్కువ ఒత్తిడితో కూడిన పనులు చేయడం కూడా తగ్గించుకోవాలి.
- మార్నింగ్వాక్, ఈవెనింగ్ వాక్‌కి సమయం కేటాయించుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది.
- మీకు నచ్చిన పనుల్లో నిమగ్నమయితే మీ సమస్యను తేలిగ్గా మరిచిపోగలరు. దీనిని సమస్యగా తీసుకోకుండా ఉండటమే చాలా మంచి పద్ధతి.
COMMENTS