జీవితంలోని సంతోషం , తృప్తి మన అభిరుచులపై ఆధారపడి ఉంటాయి. కాని ఆస్తులపై కాదు. జీవితంలో విజయాన్ని సాధించాలనుకుంటే కలలు కంటు ఉండకుండా చూస్తూ ఉం...
జీవితంలోని సంతోషం, తృప్తి మన అభిరుచులపై ఆధారపడి ఉంటాయి. కాని ఆస్తులపై కాదు. జీవితంలో విజయాన్ని సాధించాలనుకుంటే కలలు కంటు ఉండకుండా చూస్తూ ఉండకుండా ఆ కలలు నిజం చేసుకునేందుకు ప్రయత్నిస్తు ఉండాలి.
జీవనవిధానంలో మార్పు చేసుకోండిలా....
- కోపాన్ని అదుపులో ఉంచుకుంటే అందరూ మీ అదుపులో ఉంటారు. మీరు కోపంగా ఉన్న ప్రతి నిమిషంకు 60 సెకండ్ల ఆనందాన్ని కోల్పోతారు. కోపం మిమ్మల్ని కష్టాల్లోకి లాక్కెళుతుంది. గర్వం మిమ్మల్ని అక్కడే ఉండి పోయేలా చేస్తుంది. క్షణికమైన కోపాన్ని అదుపులో ఉంచుకున్న వ్యక్తి దుఃఖాన్ని దూరం చేసుకుంటాడు.
- మీ పనిలో మీకు గల అభిమానమే మీ విజయానికి రహస్యం. మీకు ఇష్టమైన దానిని చేయడంలో కాదు. మీరు చేస్తున్న దానిని ఇష్టపడడంలోనే జీవిత రహస్యం దాగుంది. కష్టించి పనిచేసేవారికి విశ్రాంతి ఆనందం తెలుస్తుంది. సమయాన్ని పాటించడం అన్న పునాదిపైనే మీ వృత్తి ఆధారపడి ఉంటుంది.
- ధైర్యంతో పనులను చేపట్టే వారినే జయలక్ష్మి వరిస్తుంది. ఫలితం ఎలా ఉంటుందో అవి భయపడే వారిని విజయం వర్తించదు. గెలవగలనన్న ఆశలేని వాడు ఆటకు ముందే ఓడిపోతాడు. ధైర్యం ఉన్నవాడు ధనవంతుడు. ధైర్యం లేనివాడు బీదవాడు. ఇతరుల కష్టాలలో దయ చూపించాలి. మీ సొంత కష్టాలలో ధైర్యం ప్రదర్శించాలి. మనసు ఎంత అదుపులో పెట్టుకోగలడో మనిషి అంతగొప్పవాడవుతాడు.
- ఉత్సాహం మనతో ఉన్నంత వరకు యవ్వనం మనతోనే ఉంటుంది. ఇరవై సంవత్సరాలలో అందంగా, ముప్పై సంవత్సరాలలో స్థిరపడక, నలభై సంవత్సరాలలో ధనవంతుడు కాకుండా, యాభై సంవత్సరంలో తెలివిగలవాడిగా లేకుండా అతడు జీవితంలో ఎప్పటికీ అందగాడుగా, స్థిర వ్యక్తిగా, ధనవంతుడుగా ఉండడు.
- వయసులో ఉన్నప్పుడూ నేర్చుకోనివాడు వయసు మళ్లిన తరువాత బాధపడతాడు. మీ సమయాన్ని మనుషులకు, పుస్తకాలకు మధ్య సమంగా పంచుకోండి. మనిషి ఎంత నేర్చుకుంటా డో నిజంగా అంత అతడి తెలివి ప్రవహిస్తుంది. వయసు పెరిగే కొద్ది ఇతరులకు సేవ చేయడంలోనే ఆనందం ఉందన్న సంగతి తెలిసి వస్తుంది. తనను తాను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించే వ్యక్తి ప్రగతిపథంలో ఉంటాడు.
- అన్నీ భగవంతుడిపైనే ఆధారపడి ఉన్నాయన్నట్లు భగవంతుణ్ణి ప్రార్థించండి. పనులన్నీ మీపైనే ఆధారపడి ఉన్నట్లు పనిచేయండి. మీ గెలుపు నుండి మరిన్ని విజయాలను మళ్లీ సాధించడానికి మీ అపజయాల నుండి ఇంతవరకూ చేసిన తప్పులను మరొక సారి చేయకుండా ఉండేందుకు మీరు నేర్చుకుంటూనే రండి. శ్రమించండి, అన్వేషించండి, గ్రహించండి కానీ లోబడకండి.
- జీవితంలో సంతృప్తిపడం నేర్చుకున్న వ్యక్తి ఆనందంగా ఉంటాడు. అది చేతకాని వ్యక్తి దుఃఖానికి గురిఅవుతుంటాడు. సాధించడంలో కాదు. ప్రయత్నంలోనే తృప్తి ఉంటుంది. వచ్చిన వాటిని వచ్చినట్లు స్వీకరించి, పోయిన వాటిని పోయినట్లు భావించి వాటితో విడిపోవడం నేర్చుకున్న వ్యక్తే సంతోషంగా ఉంటూ సంతృప్తితో జీవించే కళను అర్థం చేసుకున్న వ్యక్తి అవుతాడు.
- దాన గుణాన్ని కలిగి ఉండడం వల్ల మీరు ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువగా పొందగలుగుతారు. ఇతరుల పట్ల చూపగలిగే ఔదార్యమే మీ స్వభావానికి వన్నెనిస్తుంది. దానం సంతోషంతో, వినమ్రతతో, దయతో, విశ్వాసంతో చేయాలి. మీరు నివసిస్తున్న ప్రపంచానికి అమూల్యమైన సేవ చేయగలిగినప్పుడే నిజమైన ఆనందం, ఫల సిద్ధి లభిస్తుంది.
- మీకు అక్కరలేని విషయాలను గురించి చర్చించడమో, చదవడమో, ఆలోచించడమో లేదా వినడమో ఎప్పుడూ చేయరాదు. శీలమే సిరి, సదాచారమే సంపద నిజం చెప్పండి. నీతిని పాటించండి. పవిత్ర గ్రంథాలను చదవండి. తల్లిదండ్రులనూ, అధ్యాపకులనూ అతిథులనూ గౌరవించండి. ఎవడైతే జాగ్రత్తగా విని, శాంతంగా మాట్లాడి, చల్లగా జవాబిస్తూ చెప్పగలిగింది లేనప్పుడు మానుకుంటాడో అతని స్వాధీనంలో ఉత్తమమైనవీ, ఆవశ్యమైనవన్నీ ఉన్నట్లే.
- వృద్ధుల్ని గౌరవించాలి. యువకులకు బోధించాలి. తెలివైన వారితో సంప్రదించాలి. ఇరవైలో గాని, ఎనభైలో గానీ, ఎప్పుడైనా సరే నేర్చుకోవడాన్ని నిలిపే వ్యక్తి ముసలివాడు. నేర్చుకోవడాన్ని కొనసాగించే ప్రతివ్యక్తి యువకుడే. మనసును యవ్వనంలో నింపు కోవడమే జీవితపు ఉత్తమోత్తమ సాధన.
- తప్పు చేసానని తెలుసుకున్న తరువాత దానిని సరిదిద్దు కొనే ప్రయత్నం వెంటనే చేయండి. తనను తాను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించే వ్యక్తి ప్రగతిపథంలో ఉంటాడు. తప్పుల నుండి గుణపాఠం నేర్చుకోండి. అంతేగాని జీవితాంతం తప్పులతోనే జీవించకండి. ఇతరులకు మానసిక వ్యథను కల్పించినప్పుడు ఏదో ఒకరోజు అదే మానసిక వ్యధకు గురికాక తప్పదు.
- గౌరవంతో కూడిన మంచి జీవితాన్ని జీవించండి. మీరు ముసలి వారై నప్పుడు ఒకసారి వెనుకకు తిరిగి ఆలోచిస్తే మీకు రెండవ సారి సంతోషం కలుగుతుంది. ఎల్లప్పుడూ శక్తివంచన లేకుండా పనిచేస్తే క్షమాపణ చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. మనం కోరవలసి ది దీర్ఘ జీవనం కాదు దివ్య జీవనం. మనం మనకోసం చేసుకున్నవి మనతో మరణిస్తాయి. ఇతరులకోసం మనం చేసిన పనులు మన తరువాత శాశ్వతంగా ఉంటాయి.
- ధనార్జన కోసం సద్గుణాన్ని విక్రయించ వద్దు. అధికారం కోసం స్వేచ్ఛను అమ్ముకోవద్దు. సంపదను పెంపు చేసుకోవడం వల్ల కాదు, కోరికలను తగ్గించుకోవడం వల్ల మనం ఆనందాన్ని ఎక్కువ చేసుకోగలము. మనకున్న ఆస్తికి మరింత ఆస్తిని చేర్చడంలో తృప్తిలేదు. మన కోరికలను తగ్గించుకోవడంలో ఉంది. మీరిన ధనం తీరని బాధను కలిగిస్తుంది. మీరు డబ్బును గురించి ఆలోచిస్తే సరైన పనిచేయలేరు. మీరు సరైన పనిచేసినప్పుడే డబ్బు మీ వద్దకు వస్తుంది.
- అందరితో పరిచయం కలిగి ఉండండి. స్నేహం కొందరితో చేయండి. ఒకే ఒకరితో సన్నిహితంగా ఉండండి. నీవు ఎంత తక్కువగా మాట్లాడితే, అంత ఎక్కువగా నీ మాటలు వింటరు. ఇతరులను బాధకు గురిచేసే వ్యక్తి స్వయంగా బాధలకు గురి అవుతాడు. జీవితంలో సమస్యలు ఎదురైనపుడు పెద్దల అనుభవాల నుండి స్పూర్తి పొందాలి.
- మీలో మార్పులు రావడం ఎంత కష్టమో మీరు తెలుసుకోగలిగితే ఇతరులలో మార్పు తీసుకురావడం ఎంత కష్టమో మీకు తెలుస్తుంది. ఇతరులకు మంచి చేయడం అన్నది కర్తవ్యం కాదు. అది అనంత దాయకం. అది మీ ఆరోగ్యాన్ని మీ సుఖ సంపదలనూ ఇనుమడింపచేస్తుంది.
- ఆత్మవిశ్వాసమే గెలుపు మొదటి రహస్యం. అంతా భగవంతుడిపైనే ఆధారపడి ఉందన్న భావనతో ప్రార్థన చేయండి. అంతా మనిషిపైనే ఆధారపడి ఉందన్నట్లు పనిచేయండి. నీ చురుకైన మనస్సు, పనిలో ఆసక్తే జీవితంలో రెండు అతిముఖ్యమైనది.
- ఆరోగ్యం కోసం రోజూ కొంత సమయాన్ని కేటాయించలేని వ్యక్తి ఏదో ఒక రోజూ అనారోగ్యానికి చాలాకాలం త్యాగం చేయవలసి వస్తుంది. మీ జీవితాన్ని పొడిగించుకునే మీ భోజనాన్ని తగ్గించుకోండి. ప్రశాంతమైన మనసు విలువైన మూలధనం. అనేక భోజన పదార్థాలు అనేక రోగాలకు దారితీస్తాయి. అనారోగ్యానికి వ్యతిరేకంగా వైద్యుడే కాదు, రోగి కూడా పోరాటం చేయాలి. అనారోగ్యం దాపురించే వరకూ ఆరోగ్యం అమూల్యమని తెలియదు.
- నష్టాలకు గురికాని పెట్టుబడి 'మంచితనం' ఒక్కటే. మనిషి మనిషికి మధ్య మతం కాదు, మమత ఉండాలి. సత్ప్రవర్తన ద్వారా ఆర్జించిన వ్యక్తి సొమ్ము అతడి పిల్లల వరకు ఏమాత్రం తరగకుండా చేరుతుంది. అంతేకాదు కష్టాల నుండి అది వారిని కాపాడుతుంది. మర్యాద అన్నది గణితంలోని సున్నలాంటిది. సున్న వరకు ఏమీ విలువ లేకుండా పోవచ్చు. కానీ ఇతర అంకెలతో కలిసి ఉన్నప్పుడు ఆ అంకె విలువను ఇది బ్రహ్మాండంగా పెంచగలదు.
- మనతో కూడా జీవించేవారు మనలాగానే మనతో కూడా జీవించాలనే విషయాన్ని మనం తరచుగా మరచిపోతుంటాము. మంచి అలవాట్లను అలవాటు చేసుకోవడం కష్టమే. కానీ అలవాటు అయితే సులభంగా వాటితో జీవించగలం. అదేవిధంగా చెడు అలవాట్లను అలవాటు చేసుకోవడం సులభం, కాని వాటితో జీవించడం చాలా కష్టం. పంచిపెట్టిన కొలదీ పెరిగేది మంచితనం ఒక్కటే.
- నిద్రపోయే ముందు ఈరోజు పనులని సమీక్షించుకుని రేపు చేయాల్సిన వాటిని పథకం రూపొందించుకునే వ్యక్తి ఎప్పుడూ విజయానికి దగ్గరౌతుంటాడు. జీవితంలో విజయం సాధించాలంటే పట్టుదలను ఆప్త మిత్రుడిగా, అనుభవాన్ని తెలివిగల సలహాదారుడిగా, ముందు జాగ్రత్తను సోదరుడిగా ఆశను ప్రతిభ గల సంరక్షకులుగా స్వీకరించాలి.
- గొప్పవారి జీవితాలే మానవాళికి ఉత్తమ గురువులు. నిజాయితీగా ఉండడం ఆధ్యాత్మికమైన నైతిక నియమం. చనిపోయిన వెంటనే ప్రజలు మిమ్మల్ని మరచిపోకుండా ఉండాలంటే చదవదగ్గ పుస్తకాలు రాయండి లేదా చేయ దగ్గ పనులను చేయండి. సత్యం శ్రేష్టమైన సుగుణం. కానీ సత్యవాదిగా జీవించడం దానికంటే శ్రేష్ఠం.
COMMENTS