sleep, health articles, apurupa, telugu, teluguh, arogyam
నిద్రకు తక్కువ సమయం కేటాయిస్తూ, ఎప్పుడూ పని లోనే మునిగి తేలేవారికి స్థూలకాయమే కాదు, రక్తపోటు కూడా అధికంగా ఉంటుందని అధ్యయనంలో గుర్తించారు. దీనివల్ల గుండెజబ్బు, పక్షవాతం రెండూ పొంచి ఉంటాయి. పదివేల మంది కార్మికులపై 17 ఏళ్ల పాటు చేపట్టిన అధ్యయనంలో కొంతకాలంపాటు రోజూ నిద్ర ఏడు గంటల నుంచి అయిదు గంటలకన్నా తగ్గితే గుండె జబ్బుల ముప్పు రెండు రెట్లు పెరిగినట్లు వెల్లడైంది.
నిద్ర మార్గాలు
1. సంప్రదాయానికి మరలండి 
యోగా, తాయిచీ వంటి వ్యాయామ ప్రక్రియల్ని వారానికి మూడు రోజుల చొప్పున ఆరునెలలపాటు సాధన చెయ్యడం ద్వారా నిద్రపోయే సమయమూ, నిద్ర గాఢతా పెరుగుతాయి. 
2. రాత్రి తిండి వద్దు 
రాత్రి పడుకోవటానికి రెండు గంటల ముందుగానే ఆహారం తీసుకోవడం మంచిది. తినగానే శరీర ఉష్ణోగ్రత పెరిగి, జీవక్రియలు చురుకవుతాయి. ఫలితంగా నిద్ర రాదు. 
3. చింత వద్దు 
మీకు చింత ఎక్కువైతే.. అదేపనిగా మంచానికి అతుక్కు పోవద్దు. ఉత్సాహంగా లేచి.. మీ సమస్యలన్నీ ఒక జాబితాగా రాయండి. మీ మెదడులో నుంచి అన్నింటినీ పంపించెయ్యండి. ఉత్సాహంగా ఉండండి. నిద్ర సుఖన్నిస్తుంది. 
4. అరటి పండ్లు.. గింజలు 
పీనల్ గ్రంథి ద్వారా ఉత్పత్తయ్యే మెలటోనిన్ హార్మోస్ నిద్రను పెంచుతుంది. అరటిపండ్లు, నూనె గింజలు వంటి ఆహార పదార్థాల్లో మెలటోనిన్ ప్రేరేపించి ట్రిప్టోఫాస్ రసాయనం ఉంటుంది. పడుకోవటానికి గంట ముందు ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం మేలు. 
5. చల్లదనం మంచిది 
నిద్ర పోవటానికి అవసరమైన ఉష్ణోగ్రత 16-18 సెంటీ గ్రడ్లు ఉండాలి. అందుకని, కాలాన్నిబట్టి పడుకునే గది కిటికీలన్నీ తెరిచేసి చల్లని వాతావరణంలో హాయిగా నిద్రపోండి. 
6. తీపి వద్దు 
పడుకోవటానికి ముందు స్వీట్లు వంటి తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తంలో చెక్కర నిల్వలు పెరుగుతాయి. దీనివల్ల శరీరానికి మరింత శక్తి అంది, చురుగ్గా మారుతుంది. ఫలితంగా నిద్ర పట్టదు. తీపి పదార్థాలకు దూరంగా ఉండటమే మేలు. 
7. ఒకే వేళ 
రోజూ ఓకే సమయానికి నిద్రపోతూ, ఓకే సమయానికి మేల్కొనడం మంచి అలవాటు. వారాంతాల్లో, సెలవు రోజుల్లో కూడా ఇదే అలవాటు కొనసాగిస్తే మీ నిద్ర చక్కగా సాగుతుంది. 
8. శృంగారమూ నిద్రకు మంచిదే 
చక్కని సెక్స్ కంటి నిండా నిద్రకు తోడ్పడుతుంది. సెక్స్లో స్త్రీ పురుషులు భావప్రాప్తికి చేరినప్పుడు ఆక్సిటోసిస్,   ప్రొలక్టిన్ వంటి పలు రసాయనాలు, హార్మోన్లు విడుదలవుతాయి. ఇవన్నీ కమ్మని నిద్రకు తోడ్పడేవే. 
9. బరువు కరగాలి 
ఒంట్లో అదనపు బరువు తగ్గించుకోవాలి. నిత్యం 20 నిమిషాలు వ్యాయామాలు చేస్తూ బరువు తగ్గించాలి. రాత్రి నిద్రకు రెండు గంటల ముందు వ్యాయామం చేస్తే కంటి నిండా కునుకు తీసేయవచ్చు. 
10. పరవశించాలి 
నిద్ర బాగా పట్టాలంటే మనసు పరవశించాలి. దీని కోసం రాత్రి పడుకోవటానికి 45 నిమిషాల ముందు చక్కని లలిత సంగీతం వినడం మంచిది. దీనివల్ల నిద్రలో గాఢత 35 శాతం దాకా పెరుగుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది.