diabetic care, teluguh, telugu, apurupa, sugar care, arogyam, health care
అప్పటికి డయాబెటిస్ బయటపడిందంటే... అంతకుముందు ఎంతకాలం నుంచి అది ఉందో తెలియదు. కాబట్టి అప్పటికే అది కన్ను, మూత్రపిండాల వంటి వాటిని దెబ్బతీసిందా, తీస్తే ఏ మేరకో తెలుసుకోవడానికి ఆ పరీక్షలు చేస్తారు. ఒకవేళ దెబ్బతీసి ఉంటే, చెడిపోయిన మేరకు వదిలేసి, ఇకపై మరింత నష్టం జరగకుండా చూసుకోవడం కోసమే ఈ పరీక్షలు. ఒకనాడు షుగర్ వ్యాధి అంటే ఏ కొద్దిమందిలోనో కనిపించేది. కానీ ఇప్పుడు ఇంటికి కనీసం ఇద్దరు రోగులు ఉంటున్నారు. యాభై ఏళ్ల క్రితం మన జీవనశైలి అంతగా మారక మునుపు మధుమేహం తాలూకు ఆ లక్షణాలన్నీ ఒకప్పుడు విశ్రాంతిగా ఉండే ఆ కాలం నాటి ఏ కొద్దిమందిలోనో కనిపించేవి. అది కూడా వారి వృద్ధాప్య దశలో. కానీ 1970లలో వచ్చిన మార్పుల దుష్పరిణామాలన్నీ దాదాపు 40-50 ఏళ్లు గడిచాక చాలామందిలో... ఆ మాటకొస్తే మన ఇళ్లలోని కనీసం ఒక్కరు లేదా ఇద్దరిలోనైనా కనిపిస్తున్నాయి. పైగా అప్పట్లో వృద్ధాప్యంలో కనిపించే ఆ డయాబెటిస్ ఇప్పుడు 30 – 40 ఏళ్లకే కనిపిస్తోంది. చక్కెర వ్యాధి కలిగించే దుష్పరిణామాలు, అవి ఉన్నప్పుడు చేయించుకోవాల్సిన పరీక్షలపై అవగాహన కోసమే... ఈ వ్యాసం
మన ఇళ్లలోనే కనీసం ఇద్దరు చొప్పున డయాబెటి్స రోగులున్నప్పటికీ... ఆ వ్యాధి వచ్చే వరకూ మనమేదో దానికి అతీతులమనుకుంటాం. తీరా వచ్చాక కూడా దానితో వచ్చే అనేక దుష్పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండా అలాగే గడిపేస్తాం. తీరా అది ఆసుపత్రిలో పడేసేంతగా ప్రభావితం చేసి బెదిరిస్తే గాని అప్పటివరకూ మనం తగు జాగ్రత్తలు పాటించం. అందుకే డయాబెటిస్ గురించిన ప్రాథమిక అంశాల కంటే దానితో వచ్చే అనేక దుష్పరిణామాల గురించి తెలుసుకోవడం అవసరం. అప్పుడు డయాబెటిస్ రాని వారైతే, దాన్ని రాకుండా నివారించడం లేదా వచ్చే పరిస్థితులు ఉంటే వీలైనంత ఆలస్యం చేయడానికీ, ఒకవేళ అప్పటికే వ్యాధి వచ్చి ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి వీలవుతుంది. డయాబెటిస్ రోగులకు వచ్చే దుష్పరిణామాలు డయాబెటిస్ రోగులకు ప్రధానంగా రెండు రకాల దుష్ప రిణామాలు సంభవిస్తాయి. అవి...
అతి సూక్ష్మ రక్తనాళాలకు సంబంధించిన దుష్పరిణామాలు: వీటినే వైద్యపరిభాషలో మైక్రో వాస్క్యులార్ కాంప్లికేషన్స్ గా పేర్కొనవచ్చు. ఎందుకంటే వీటిలో అతి సన్నటి రక్తనాళాలు/రక్తకేశనాళికలు ఉండే శరీరభాగాలు దెబ్బతింటాయి. అంటే... ప్రధానంగా కళ్లు, మూత్రపిండాలు, నరాలు.
మామూలు రక్తనాళాలు దెబ్బతినడంతో వచ్చే దుష్పరిణామాలు: వీటినే మ్యాక్రోవాస్క్యులార్ కాంప్లికేషన్స్ గా పేర్కొనవచ్చు. అంటే ఇందులో అతి సూక్ష్మ రక్తనాళికలు కాకుండా కాస్త పెద్దవి, ప్రధానమైనవే అయిన రక్తనాళాలకు సమస్యలు వచ్చి, వాటితో అనుసంధానమై ఉండే ప్రధాన అవయవాలు దెబ్బతింటాయన్నమాట. గుండె, మెదడు, కాళ్లూచేతుల్లో ఉండే పెద్ద రక్తనాళాల్లో కొవ్వు పేరుకోవడంతోవచ్చే కొన్ని దుష్పరిణామాలివి. మైక్రోవాస్క్యులార్ దుష్పరిణామాలు అత్యంత సూక్ష్మ రక్తనాళికలు దెబ్బతింటే వచ్చే వ్యాధులు, వాటివల్ల ఏ మేరకు అవి నష్టపోయాయో తెలుసుకోవడం ఇలా...
డయాబెటిస్ రెటినోపతి:
రెటీనాకు కూడా రక్త సరఫరా అవసరం కాబట్టి, అతి పలుచని ఆ పొరకు సరఫరా అయ్యే రక్తనాళాలు అత్యంత సన్నగా ఉంటాయి. దాంతో చక్కెరతో చిక్కబారే రక్తం రెటీనాకు తగినంత సర ఫరా కాకపోతే రెటీనా దెబ్బతింటుంది. దాంతో దృష్టి కూడా మందగిస్తుంది. డయాబెటిస్ వల్ల రెటీనాకు వచ్చిన ఈ దుష్పరిణామాన్ని డయాబెటిస్ రెటినోపతి అంటారు. నిజానికి ఈ కారణంగా కనిపించే ఫలితాలు కనిపించక ముందు నుంచే ఈ దుష్పరిణామాలు మొదలైపోతాయి. కాబట్టి ఒకవేళ డయాబెటిస్ను కనుగొనగానే ఈ దుష్పరిణామాలు మొదలయ్యాయా లేదా చూడాలి. అందుకే డయాబెటిస్ ఉన్నట్లు తెలియగానే దృష్టికి సంబంధించిన పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.
డయాబెటిస్ నెఫ్రోపతి:
రక్తంలోని మాలిన్యాలను తొలగించేందుకు ఉద్దేశించిన అతి సన్నటి రక్తనాళాలు మూత్రపిండాల్లో ఉంటాయి. రక్తంలోని చక్కెరపాళ్లు ఆ నాళాలపై దుష్ర్పభావాన్ని చూపితే మూత్ర పిండాల బాధ్యత అయిన వడపోత కార్యక్రమం దెబ్బతిని, మాలిన్యాలన్నీ ఒంట్లోనే ఉండిపోతాయి. దాంతో శరీర మంతా విషపూరితంగా మారిపోవడం వల్ల ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు. అందుకే చక్కెర వ్యాధితో ఆ పరిస్థితి వచ్చే లోపే మూత్రపిండాలు ఆ మేరకు దెబ్బతిన కుండా జాగ్రత్తపడాలి. మూత్రపిండాలు శరీరానికి అవసరమైన మలినాలను మాత్రమే వేరు పరచి, శరీరానికి అవసరమయ్యే కొన్ని లవణాలు, ప్రోటీన్లు, సీరమ్ క్రియాటినిన్ వంటి పదార్థాలు ఉంటే వాటిని వేరుపరచకుండా అలాగే వదిలేస్తాయి. ఒకవేళ అవి మూత్రంలో కనిపించాయనుకోండి. అప్పుడు మూత్ర పిండాలు వాటి బాధ్యతలను సరిగా నెరవేర్చడం లేదని తెలుస్తుంది. ఆ పరీక్షల ద్వారా డాక్టర్లు కిడ్నీల పనితీరును అంచనా వేస్తుంటారు. ఉదాహరణకు మైక్రో ఆల్బుమిన్ యూరియా అనే పదార్థం మూత్రంలో కొంత పరిమితిలోనే ఉండాలి. ఒకవేళ మూత్రపరీక్షలో అది పరిమితికి మించి కనిపించిందనుకోండి. డాక్టర్లు దాన్ని బట్టి డయాబెటిక్ నెఫ్రో పతి అనే జబ్బు ఉన్నట్లు గుర్తించి, తగిన చికిత్సను, జాగ్రత్తలను సూచిస్తారు.
డయాబెటిక్ న్యూరోపతి:
కొందరిలో చేతుల్లోని నరాలు లాగినట్లుగా ఉండటం, చేతుల చివర్లు తిమ్మిరెక్కినట్లుగా ఉండటం, కొందరిలో అరుదుగా చివర్లు స్పర్శను కోల్పోవడం వంటివి జరుగుతుంటాయి. అన్ని అవయవాల ను దెబ్బతీసినట్లే, చక్కెర నరాలపై కూడా దుష్ర్పభావం చూపడం వల్ల ఈ దుష్పరిణామాలు సంభవిస్తాయి. కొన్ని సార్లు ఈ దుష్పరిణామాలతోనే కొందరిలో డయాబెటిస్ బయటపడుతుంది. ఒకవేళ ఇలాంటి పరీక్షలే చేయకపోతే ఒక్కోసారి వ్యాధి ముదిరిపోయి, తిమ్మిర్లు పట్టే శరీరభాగం కుళ్లి (గ్యాంగ్రీన్గా మారి) ఆ అవయవాన్నే తొలగించాల్సిన పరిస్థితి రావచ్చు.
మ్యాక్రోవాస్క్యులార్ దుష్పరిణామాలు
కరోనరీ ఆర్టరీ డిసీజెస్ (గుండెజబ్బు లు):
డయాబెటిస్ ఉన్నవాళ్లకు నొప్పి పెద్దగా తెలియదు. గుండెనొప్పి కూడా తెలియదు. దాంతో లక్షణాలను పసిగట్టి, అవి గుండెజబ్బులని తెలుసుకునేలోపే జరగాల్సిన ప్రమాదం జరగవచ్చు. అందుకే డయాబెటిస్ ప్రభావం గుండెకు రక్తసరఫరా చేసే రక్తనాళాలపై పడి, అక్కడ రక్తపుగడ్డల అడ్డంకి (బ్లడ్ క్లాట్స్)తో గుండెపోటు వంటివి వచ్చే అవకాశాలున్నాయా అని అంచనా వేయడం కోసం ఏడాదికోసారైనా ఈసీజీ తీయించుకుంటూ ఉండాలి. దీంతోపాటు రక్తంలోని కొవ్వులపాళ్లను అంచనావేసే లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షలూ చేయించుకుంటూ ఉండాలి.
హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు):
కొన్ని కారణాలు మన సాధారణ రక్తపోటును మరింత అధికం చేస్తాయి. దాంతో అధిక రక్తపోటు (హైబీపీ) వచ్చే అవకాశాలున్నాయి. స్థూలకాయం, నెఫ్రోపతి, డయాబెటిస్ రోగులకు ఇలా అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు మరింత ఎక్కువన్నమాట. అందుకే అధిక రక్తపోటు ఉందా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ప్రతి మూడు నెలలకూ ఓసారి బీపీ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఒకవేళ అధిక రక్తపోటు ఉంటే, ఆ ఒత్తిడికి అసలే చాలా సూక్ష్మంగా ఉండే మూత్రపిండాల్లోని రక్తనాళాలు చిట్లే ప్రమాదం ఉంది. అందుకే నిత్యం బీపీని పరీక్షించుకుంటూ ఉండటంతో పాటు, ఒకవేళ ఉన్నా లేకపోయినా, అధిక రక్తపోటుకు కారణమయ్యే ఉప్పును వీలైనంత తక్కువగా తీసుకోవడం మంచిది.
పెరిఫెరల్ వాస్క్యులార్ డిసీజ్:
రక్తంలో చక్కెరపాళ్లు అధికమైనప్పుడు అది మరింత చిక్కగా మారి కొన్ని క్లాట్స్ ఏర్పరుస్తుందని, ఒకవేళ అవి మెదడు రక్తనాళాల్లో ఏర్పడితే స్ట్రోక్ వంటి ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయన్న విషయం తెలిసిందే. మరి ఒంట్లో అన్నిచోట్లా రక్తనాళాలు విస్తరించి ఉంటాయి. వాటిల్లో రక్త ప్రవాహం ఉంటుంది. కాబట్టి అక్కడ ఇలాంటి ప్రమాదం ఉండదా... అంటే అక్కడా ఉండే అవకాశం ఉంది. కాకపోతే మెదడు చాలా కీలకం. శరీరం లోని అన్ని భాగాలను నియంత్రిస్తుంటుంది కాబట్టి స్ట్రోక్కు ఇచ్చిన ప్రాధాన్యం, మిగతా భాగాలకు మనం వెంటనే చూపం. అయితే అదే పరిణామం మిగతా శరీర భాగాలకూ, ముఖ్యంగా కాళ్లూ, చేతుల్లోని రక్తనాళాల్లో సంభవిస్తే, అది సరఫరా చేసే శరీర భాగాలు మొద్దుబారిపోయి, గాంగ్రీన్ కు (కుళ్లిపోవడానికి) గురవుతాయి. దానికి ముందు అక్కడ శరీర భాగంలో పుండు పడటం (అల్సర్) వంటి లక్షణాలూ కనిపిస్తాయి. అది గాంగ్రీన్ గా మారి, ఇక చివర్లో ఆ భాగాన్ని తొలగించడం మినహా మరో మార్గం ఉండకపోవచ్చు.
ఇలా శరీర భాగాన్ని తొలగించాల్సిన పరిస్థితిని ఆంప్యుటేషన్ అంటారు. ఇలా చేస్తే గాని మిగతా ఆరోగ్యకరమైన శరీర భాగాన్ని రక్షించుకోలేని పరిస్థితుల్లో ఈ గత్యంతరం లేని చర్యకు ఉపక్రమిస్తారు డాక్టర్లు. అందుకే శరీర భాగాలన్నింటికీ సరిగా రక్తం సరఫరా అవుతుందో లేదో తెలుసుకోడానికి ‘యాంకిల్ బ్రాకియల్ ఇండెక్స్’(ఏబీఐ) అనే పరీ క్షను నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే కాళ్లూ, చేతులకు సరైన రీతిలో, సరైన ఒత్తిడితో రక్తసరఫరా జరుగుతోందో లేదో తెలుసుకునేందుకు సైతం డాప్లర్ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి దీన్ని డాక్టర్లు నిర్వహిస్తారు. ఇందులో విలువ 0, 9 కంటే తక్కువగా ఉందంటే ఆయా అవయవాలకు రక్తసరఫరా తక్కువగా ఉందన్నమాట. అప్పుడు అవసరాన్ని బట్టి డాప్లర్ పరీక్ష చేయాల్సి ఉంటుంది. లక్షణాలు కనిపించడానికి ముందే దుష్పరిణామాలు సంభవించే అవకాశం ఉన్నందున ఈ పరీక్షలు చేయించడం అవసరం.
అందుకే ఈ పరీక్షలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. చిన్న పరీక్షతో చింతలన్నీ దూరం... రక్తంలో చక్కెర పాళ్లు పెరుగుతున్నాయా లేదా నిర్ధారణ చేయడానికి ఒక చిన్న పరీక్ష చాలు. అదే... హెచ్ బి ఏ1సీ. దీనిలో విలువ 6.5 నుంచి 7 శాతం మధ్యలో ఉందంటే చక్కెర పాళ్లు అదుపులో ఉన్నట్లే. అందుకే ప్రతి మూడు నెలలకోసారి ఈ పరీక్ష చేయించుకుంటే నిర్భయంగా ఉండవచ్చు.
COMMENTS